calender_icon.png 27 October, 2024 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

90’s కిడ్స్.. స్పెషల్

18-05-2024 12:05:00 AM

మీకు గుర్తుందా...! చిన్నప్పుడు వేసవి సెలవులు కానీ దసరా సెలవులు కానీ వస్తే అమ్మమ్మ ఊరికి వెళ్లే వాళ్లం. ఊర్లోని స్నేహితులతో కలిసి ఆడుకోవడం. జామాకులో చింతపండు పెట్టి కొద్దిగా కారం, ఉప్పు వేసి తినేవాళ్లం. ఇది చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా... చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అలానే మీ ఊహలలో ఊరుతున్నాయనుకుంటాను. చెట్లెక్కి జామకాయలు, మామిడికాయలు కోయడం, చెరువు గట్టు మీద తిరగడం.. ఈత కొట్టడం... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో మధుర జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతుంటాయి. కాలంతో సహా వెనక్కి వెళ్లి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అప్పటి ఆటలను ఓ సారి గుర్తు చేసుకుందాం పదండి...

స్నేక్ అండ్ ల్యాడర్స్ 

ఈ ఆట తెలంగాణలో ఎక్కువగా కైలాసం పేరుతో ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ ఆటకు దశపద, మోక్షపఠం, వైకుంఠపాళి అని కూడా పేర్లు ఉన్నాయి. క్రీ.పూ 2వ శతాబ్దం నుంచి కైలాసం ఆట ఉన్నట్టుగా కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నా యి. ప్రామాణికంగా మాత్రం పఠంలో మొత్తం 10 అడ్డ వరుసలు, నిలువు వరుసలతో 100 గడులుంటాయి. గడులు, వరుసలు పఠాన్ని బట్టి మారుతుంటాయి. పఠంలో పాములు, నిచ్చెనలు ఉంటాయి. ఆట ప్రారంభించే ముందు ఆటగాళ్లు తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి పందెం వేస్తూ నడుపుతూ ఉంటారు. ఆరు గవ్వలుగాని లేదా పాచికలు గాని పందెం చేస్తూ ఆడుతారు. ఈ ఆటను ఎందరైనా ఆడవచ్చు కానీ ఆడే వాళ్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరకం ఆటకాయలను ముందుగా నిర్ణయించుకోవాలి. నిచ్చెన పాదం దగ్గరకు కాయ వస్తే నిచ్చెన ఎక్కి ముందుకు వెళ్తారు. అదే పాము నోటి దగ్గరకు కాయ వస్తే  పాము మింగడం వల్ల తోక దగ్గరకు కాయ చేరుకుంటుంది. గమ్యాన్ని ఎప్పుడైతే కాయ చేరుతుందో అప్పుడే పండినట్టు లెక్క... ఆ కాయ వ్యక్తి విజేత అయినట్టుగా నిర్ధారిస్తారు. 

అష్టాచెమ్మ

ఈ ఆటను వేసవి కాలంలో ఎక్కువగా ఆడతారు. ఆట ఆడేటప్పుడు నిలువుగా ఐదు, అడ్డంగా ఐదు గడులను గీయాలి అవి మొత్తం దీర్ఘ చతురస్రాకారంలో 25 గడులు ఉండాలి. ఆట ఆడే నలుగురిలో ఒక్కొక్కరి వద్ద నాలుగేసి కాయలు ఉంటా యి. ఆట ఆడడానికి నాలుగు గవ్వలు వాడతారు. గవ్వలు లేకుంటే చింతపిక్కలను ఒకవైపు అరగదీసి ఉపయోగిస్తారు. నాలుగు గవ్వలు బోర్లా పడితే  అష్టా, వెల్లకిలా పడితే చెమ్మా. ఈ రెండూ కాకుండా ఎన్ని వెల్లకి లా పడితే ఆ విసురు విలువ అంత ఉం టుంది. ఆటఆడే వారి కాయలు ఇంటూ (X) గుర్తు గడిలో ఉన్నంత సేపు వాటిని ప్రత్యర్థుల కాయలు చంపలేవు. వేరే గడిలో ఉంటే చంపే అవకాశం ఉం టుంది. చనిపోయిన కాయ మళ్లీ ఉపయోగించాలంటే అష్ట పడాల్సి ఉంటుంది. చంపిన వారికి చంపుడు బంధం దొరుకుతుంది... దీంతో వాళ్లు మరోసారి గవ్వల ను వేసే అవకాశం ఉంటుంది. ఇలా ఉత్కంఠ భరితంగా సాగే ఆటలో ఇంట్లోకి ఎవరు వెళ్తారో ఆట విజేతలుగా నిలుస్తా రు. ఇప్పుడు కూడా అక్కడక్కడా ఈ ఆట ను ఆడుతున్నారు. అష్టాచెమ్మ ఇప్పుడు మొబైల్‌లో లూడో గేమ్ ఆడినట్లే!

చిర్రగోనె

కర్రబిళ్ల, గోణి బిళ్ల, గూటి బిళ్ల, బిళ్ల కర్ర, చిల్లం గోడు, కోడింబిళ్ల, చిల్లగాల, బిల్లంగోడు అనేక రకాల పేర్లతో ఈ ఆట ప్రచారంలో ఉంది. ఆటలో ఉపయోగించే నాలుగు అంగుళాల కర్ర ముక్కను బిళ్ల అని అంటారు. రెండు అడుగుల పొడువు కర్ర కూడా ఆటలో ఉపయోగిస్తారు. అందుకే ఈ ఆటకు కర్రబిల్ల అని పేరు. నేల మీద చిన్న గుంట తవ్వి దాని మీద బిళ్లను ఉంచి కర్రతో ఎగుర కొడతారు. ఈ ఆటను ఇద్దరు లేక నలుగురు ఆడుతుంటారు. ఒకరు బిళ్లను కర్రతో కొట్టేటప్పుడు రెండవవారు కొంత దూరంలో నిలబడి బిళ్ల కింద పడకుండా పట్టుకో వాలి. అలా పట్టుకోగలిగితే బిళ్లను కొట్టిన వారు ఓడినట్టు. ఈ ఆట గురించి చెప్తుంటే మీరు ఆడిన సందర్భం గుర్తొచ్చింది కదా..!

తొక్కుడు బిళ్ల

భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పిల్లలు ఆడే ఆటలో ఈ ఆట కూడా ఉంది. ఇది ఆటను మెసిడోనియా వాసి అయిన అలెగ్జాండర్ ది గ్రేట్ కనుగొన్నాడని చారిత్రకారుల అభిప్రా యం. ఈ ఆటను కచ్చితంగా ఇంత మందే ఆడాలని ఏమి లేదు. ఆటను ఒంటరిగా లేదా జట్టుగా కూడా ఆడవచ్చు. భారతదేశంలో ఈ ఆటను ఊర్లల్లో ఎక్కువగా ఆడపిల్లలు ఆడతారు. అయితే ప్రస్తుతం ఈ ఆటను ఎక్కువగా ఎవరూ ఆడడం లేదు. ఈ ఆటను స్కూల్‌లో విరామం దొరికినప్పుడు అప్పట్లో ఎక్కువగా ఆడేవారు. ఇప్పడు మాత్రం పిల్లలు మొబైల్‌లోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు.

దాగుడు మూతలు

ఇంగ్లీష్‌లో హైడ్ అండ్ సీక్‌గా పిలువబడే ఈ ఆటలో పిల్లలందరూ కలిసి ఒక దొంగను ఎంచుకుంటారు. వీళ్లను ఆడించే వ్యక్తి ఆ దొంగ కళ్లు మూసి, ఒక చెయ్యి పట్టుకుని ఎదురుగా నిలబడ్డ పిల్లలలో వరుసగా ఒకరి వంక చూపిస్తూ, ‘వీరీవీరీ గుమ్మడి పం డు వీరి పేరేమీ’ అని అడుగుతారు. అప్పుడు దొంగ పేరు చెబితే ఆ పిల్లగాడు వెళ్లి దక్కుంటాడు. ఇదే విధంగా అందరూ కనబడకుండా దాక్కున్న తర్వాత... ‘దాగుడు మూతలు దండాకోర్! పిల్లీ వచ్చే ఎలుకా భద్రం, ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్ సాంబారు బుడ్డీ’ అని పాడుతూ దొంగ కళ్లపై అడ్డుగా చెయ్యి తీసేసి, దాక్కున్న వారిని కనుక్కోమని చెబుతారు. దొంగ ఆటగాళ్ల కోసం అంతా వెదు కుతాడు. ఎవరు ముందు దొరికితే వాళ్లు దొంగ అవుతారు. అతనితో మళ్లీ ఆట మొద లు పెడతారు. ఈ ఆటలే కాకుండా కబడ్డీ, కోతి కొమ్మచ్చి, ఖోఖో, గుడుగుడు గుంజం ఆట, నాలుగు స్తంభాలాట, నేల బండ, వామ న గుంటలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 90’s వాళ్లందరికీ ఇపుడు అవన్నీ మధురజ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వీటి ని మన మధుర జ్ఞాపకాలుగా మిగిల్చేకన్నా మన పిల్లలతో ఆడిస్తే వాళ్లకు శారీరక వ్యా యామమూ అవుతుంది. ఇంకా పిల్లలు ఫోన్‌లకు, టీవీలకు అతుక్కుపోకుండా ఈ ఆటల ను ఆడి ఎంజాయ్ చేస్తారు.

ఏడు పెంకులాట

దబిడి దిబిడి, లగోరి, వీపువాపు అనే ఈ ఆట దక్షిణ భారత దేశంలో ఎక్కువగా చిన్నపిల్లలు యువకులు వీధులలో ఆడేవారు. అయితే రెండు జట్టుల మధ్య ఆడబడే ఈ ఆటలో ఏడు పెంకులు, ఒక బంతిని ఉపయోగిస్తారు. ఒక జట్టుకు చెందిన వ్యక్తి బంతి ని పెంకుల మీదకు విసిరి పడగొడతాడు. చెల్లా చెదురుగా పడ్డ పెంకులను మళ్లీ ఒకదానిమీద ఒకటి పేర్చాల్సి ఉంటుంది. ఇది ప్రత్యర్థి జట్టు బంతితో కొట్టే లోపు చేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి జట్టు పెంకులు పేర్చే లోపు వాళ్లలో ఎవరినైనా బంతితో కొడితే వారు గెలిచినట్టుగా నిర్ణయిస్తారు. బడి నుం చి వచ్చిన తర్వాతనో సెలవులలోనో ఈ ఆట ఒక వ్యాయామంలా ఉపయోగపడేది. చాలా సంతోషాన్ని ఇచ్చేది కూడా... పిల్లలు అందరితో కలిసిపోవడానికి చాలా బాగా ఉపయోగపడేది.

 - సయ్యద్ ముజాహిద్ అలీ