కోనరావుపేట, జనవరి 12: ఐదేళ్ల చిన్నారిపై ఓ వద్ధుడు పైశాచికత్వంతో లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో అంగన్వాడీలో చదువుతున్న చిన్నారిపై అంగన్వాడి ఆయా భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఇంటికెళ్లిన చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వైద్యులను సంప్రదించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి విచారణ చేపట్టారు.
వారం రోజుల క్రితమే ఘటన జరిగిందని, అధికారుల విచారణలో వెళ్లడైంది. అయితే చిన్నారులను సంరక్షించాల్సిన అంగన్వాడీ కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంపై సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం కొట్టచ్చినట్లు కనిపిస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీస్ అధికారులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం.
ఐదేళ్ల చిన్నారిపై కర్కశంగా వ్యవహరించిన కీచకుడుని కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ఎప్పటికప్పుడు అంగన్వాడి కేంద్రాలను పరిశీలించాల్సిన అధికారులు పట్టణాలలో నివాసం ఉంటూ వాటిని పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.