పలుమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
ముమ్మాటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
ఆరోపిస్తున్న కాలనీవాసులు
అలంపూరు ఆగస్టు 25(విజయ క్రాంతి): కాలనీలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా ఉందని, చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులందరు సంబంధిత విద్యుత్ లైన్ మాన్ కి సంబంధిత అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్న అధికారులకు రవ్వంత కూడా చెవికెక్కలేదు. దీంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదివారం ఓ పసి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన గద్వాల జిల్లా అలంపూరు మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన కథనం... తెలుగు చిన్న మద్దిలేటి, మానస దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాలనీలో సోమవారం జరిగే ఓ వివాహ వేడుక నిమిత్తం విద్యుత్ అధికారులతో లైన్ క్లియరెన్స్ తీసుకొని ఇంటి ముందు ఉన్న చెట్లను తొలగిస్తుండగా ఆ చెట్టు కొమ్మలు విద్యుత్ తీగల మీద పడాయి.
కొమ్మల బరువుకి ప్రమాద భరితంగా విద్యుత్ స్తంభం అక్కడే ఆడుకుంటున్న మహేష్(4) తల మీద విరిగిపడింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ళముందే ఆడుకుంటున్న తమ కుమారుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీయ్యారు. కాలనీలో ప్రమాదపరితంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విద్యుతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాలనీవాసులు మండిపడ్డారు. బాలుడి మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.