calender_icon.png 3 October, 2024 | 6:49 PM

నేటి నుంచి చికున్ గున్యా స్పెషల్ డ్రైవ్

03-10-2024 01:05:20 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలో చికున్ గున్యా కేసుల నివారణకు నేటి(గురువారం) నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి, యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. చికున్ గున్యా కేసు నమోదైన ఇళ్ల చుట్టుపక్కల 50 నుంచి 100 ఇళ్ల వరకూ సర్వే చేసి దోమల ఉత్పత్తి జరిగే ప్రాంతాలను గుర్తించాలన్నారు.

ఈ మేరకు బుధవారం చికున్ గున్యా నివారణపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దోమలు ఉత్పత్తి జరిగే ప్రాంతంలో నీరు నిల్వ ఉన్నట్టయితే యాంటీ లార్వా ఆపరేషన్‌తో పాటు ఫాగింగ్ చేయాలని సూచిం చారు. చికున్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

నీటి గుంతలను పూడ్చాలని, నీటి నిల్వ గల మురికి నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని, ఫ్రెష్ వాటర్‌లో గంబూషియా చేపలు వదలాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికున్ గున్యాకు సంబంధించిన రోగి వివరాలు, అడ్రస్‌ను నమోదు చేయాలన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నమోదైన చికున్ గున్యా కేసులకు టెస్టులు చేయాల్సిందిగా ఆదేశించారు.