calender_icon.png 12 January, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కెంటికలమ్మ

16-09-2024 12:00:00 AM

ఓ సంకల 

కడుపులు నింపే పంట 

ఇంకో సంకల 

కడుపులో పుట్టిన పంట 

నెత్తిన బాసండ్ల మూట.

కాటన్ చీర చుట్టుకొని

మొండి మెడలో పసుపు దారాన్ని భరిస్తూ

కండ్లముందు కనబడే భరతమాత.

కోటానుకోట్ల దేవుండ్లు

నడయాడిన పుణ్యభూమిలో

విముక్తికి నోచుకోని పాపపు రాత

సకల సంపదలతో

అమృతాన్ని పంచుకున్న దేశంలో 

అంబలి చుక్కకై వెతుకులాట ఆమెది

గంపెడు 

దరిద్రాన్ని మోస్తూ....

ఎన్ని ఊర్లు తిరిగిందో 

ఎన్ని గడపలు తొక్కిందో

దింపే నాథుడే దిక్కు లేడు 

ఎవరి చేతులు ఖాళీగా లేవు

ఎవరి బరువుల్లో వాళ్ళు 

బిజీ బిజీగా ఉన్నరు 

ఖాళీగా ఉన్నోళ్ళు 

కర్మ అంటూ నిందిస్తుంటరు.

కొందరు దొంగదంటూ

పిల్లలెత్తుక పోయేదంటూ 

చేయని పాపానికి 

చేతివాటం చూపిస్తుంటరు.

చిక్కెంటుకలమ్మో , చిక్కెంటుకలు 

అంటూ కాంటలు, బొట్టు పిల్లలు, 

లబ్బర్ బుగ్గలతో పాద్దు పొద్దునే 

మన వాకిళ్ళ ముందు 

వాలిపోయే కాకమ్మ 

రాలిపోయి, అల్లిబిల్లిగా

చిక్కులు పడ్డ ఎంటుకలను 

తీసుకొని 

ఎంత నేర్పుతో ఏపోసకాపోస తీసి

అందమైన సౌరాలుగా తీర్చిదిద్దిన 

ఆమె బతుకు చీకట్ల 

చిక్కులను విప్పేదెవరో?

చిక్కొండ్ర రవి 

9502378992