01-03-2025 11:40:53 PM
హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్న బీజేపీ..
హాజరవుతున్న ఏఐఏడీఎంకే..
డీలిమిటేషన్, 3 లాంగ్వేజ్ పాలసీ మీద చర్చ...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. అయితే ఈ సమావేశానికి హాజరుకావొద్దని బీజేపీ నిర్ణయించుకుంది. కేంద్రం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ పాలసీ మీద ఈ మీటింగ్ జరగనుంది. అంతే కాకుండా డీ లిమిటేషన్ గురించి కూడా ఇందులో చర్చించనున్నారు. బీజేపీ ఈ మీటింగ్‌కు వెళ్లొద్దని నిర్ణయించుకుంది. బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ‘ఈ సమావేశానికి ఎందుకు హాజరుకావట్లేదో కూలంకుషంగా వివరిస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖను పంపాం. స్టాలిన్ నుంచి వచ్చిన లేఖ డీ లిమిటేషన్, త్రీ లాంగ్వేజెస్ పాలసీ విషయంలో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అనుమానాలపై పలు ప్రశ్నలను సంధిస్తూ మేము లేఖ పంపాం’. అని బీజేపీ నాయకులు తెలిపారు.
హాజరుకానున్న ఏఐఏడీఎంకే..
బీజేపీతో పొత్తులో ఉన్న ఏఐఏడీఎంకే పార్టీ ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకుంది. డీఎంకే ప్రభుత్వం నిర్వహించబోయే అఖిల పక్ష సమావేశానికి తాము హాజరవుతామని ఏఐఏడీఎంకే నాయకులు తెలిపారు. డీ లిమిటేషన్ వల్ల తమిళనాడులో లోక్‌సభ స్థానాల సంఖ్య 39 నుంచి 31కి పడిపోతుందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద పార్టీల వైఖరి గురించి తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోపణనను తమిళనాడు బీజేపీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఖండిస్తూ వస్తోంది. స్వయానా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇదంతా తప్పుడు ప్రచారం అని డీ లిమిటేషన్ వల్ల తమిళనాడులో ఒక్క లోక్‌సభ స్థానం కూడా తగ్గదని తెలిపారు. అంతే కాకుండా డీఎంకే పార్టీ కేంద్రం తీసుకొచ్చిన త్రీ లాంగ్వేజ్ పాలసీని కూడా వ్యతిరేఖిస్తోంది. తమిళ ప్రజల మీద కేంద్రం బలవంతంగా హిందీని రుద్దుతోందని డీఎంకే ఆరోపిస్తోంది.