మంచిర్యాల జిల్లాకు చెందిన దివ్యాంగుడి వేడుకోలు
బెల్లంపల్లి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ‘నేను పూర్తిగా దివ్యాంగుడిని.. అయినప్పటికీ ఎంతో కష్టపడి, అవరోధాలు ఎదుర్కొని డిగ్రీ పూర్తి చేశాను. దివ్యాంగుల కోటాలో నాకు కొలువు ఇప్పించమని గత ప్రభుత్వాన్ని వేడుకున్నాను. అయినప్పటికీ నాపై దయ చూపలేదు. ఏళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నాను.
నాకున్న వైకల్యానికి వేరే పనేమీ చేయలేను. కొలువు కోసం పదేళ్లు ఎదురుచూసి అలసిపోయాను. కొత్త ప్రభు త్వం వచ్చాక ఆశలు వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి సార్.. మీరైనా కనికరం చూపాలి. నా తల్లి ఇప్పటికే మరణించింది. తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నాకు దివ్యాంగుల కోటాలో ఏదైనా కొలువు ఇప్పించండి.
నా కుటుంబాన్ని ఆదుకోండి’ అని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లెకి చెందిన ఎలిగేటి తిరుపతి అనే దివ్యాంగుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియో సీఎం వద్దకు చేరుకోవాలని, సీఎం స్పం దించి తనకు న్యాయం చేయాలని దివ్యాంగుడు వేడుకున్నాడు.