calender_icon.png 1 April, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణానికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

29-03-2025 10:48:02 PM

విఐపిలు, భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు..

భద్రాచలం (విజయక్రాంతి): ఏప్రిల్ 6 తారీఖు నాడు జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకంనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో సీఎంతో పాటు వివిఐపీలు, వీఐపీలు సౌకర్యంగా కూర్చుని కళ్యాణం తిలకించడానికి జరుగు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కళ్యాణం తిలకించడానికి 250 మంది వివిఐపీలు, 500 మంది వీఐపీలు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, హైకోర్టు, సుప్రీం కోర్ట్ జడ్జిలు వారి కుటుంబాలతో వచ్చే అవకాశం ఉన్నందున వారి హోదాలకు తగ్గట్టు కూర్చోవడానికి సీట్లు అమర్చాలని అన్నారు.

అలాగే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ చల్లని గాలి వీచే విధంగా ఫాగ్ ఏర్పాటు చేస్తున్నామని, కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా చూసి దర్శనము చేసుకొని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరాలని, కళ్యాణం కాగానే భక్తులు స్వామివారి తలంబ్రాల కోసం భక్తులు ఎవరు ఎగబడవద్దని, అందరికీ తలంబ్రాలు, ప్రసాదాలు దొరికే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులందరికీ మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు గ్యాలరీలోనే అందించడానికి సిబ్బందిని నియమించామని, భక్తులందరూ అధికారులందరికీ సహకారం అందించి స్వామివారి కల్యాణాన్ని తిలకించాలని అన్నారు. 

ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు చూపరులకు కనువిందు చేసేలా మ్యూజియంను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సారాజ్యంలో ముస్తాబు చేస్తున్నారని, ఆ మ్యూజియం కూడా సీఎం చేత ప్రారంభం చేయిస్తున్నామని, కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గిరిజన సాంప్రదాయాలకు సంబంధించిన మ్యూజియంను సందర్శించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీవో దామోదర్ రావు, దేవస్థానం ఈవో రవీందర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ బ్రహ్మయ్య, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏ ఈ రవి, తాసిల్దార్ శ్రీనివాస్, ఏవో గన్యా, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.