calender_icon.png 21 October, 2024 | 3:09 AM

గ్రూప్-1పై ముఖ్యమంత్రి మొండి వైఖరి సరికాదు

21-10-2024 12:43:16 AM

  1. పరీక్షలు వాయిదా వేయబోమని ప్రకటించడం దుర్మార్గం 
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 20: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొండి వైఖరి సరికాదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. పరీక్షలు వాయిదా వేయబోమని సీఎం ప్రకటించడం అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయని అన్నారు.

జీవో 29ని రద్దు చేయాలని గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులపై లాఠీచార్జి అన్యాయమని పేర్కొన్నారు. జీవో 29 తప్పని గగ్గోలు పెడుతుంటే.. సీఎం, అధికారులు వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు.

సమావేశంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేములు రామకృష్ణ, నాయకులు సీ రాజేందర్, జీ అనంతయ్య, నందగోపాల్, ఉదయ్ నేత, మోదీ రాందేవ్, రుషి కుమార్, ఉమామహేశ్వర్‌రావు, సహదేవ్, శివ తదితరులు పాల్గొన్నారు.