calender_icon.png 23 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు

23-04-2025 12:47:31 AM

- జీహెచ్‌ఎంసీకి వినియోగదారుడి ఫిర్యాదు 

- వారం రోజుల తర్వాత షాగౌస్ హోటల్‌లో తనిఖీలు

- అధికారుల తీరుపై విస్మయం

కార్వాన్, ఏప్రిల్ 22: హోటల్‌లో వెజ్ బిర్యానీ కొని, ఇంటికి పార్సిల్ తీసుకెళ్లిన ఓ వినియోగదారుడు అవాక్కయ్యాడు. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడంతో ఆశ్చర్యానికి గురై వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

సుమారు పదిరోజుల క్రితం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యక్తి టోలీచౌకీలోని షాగౌస్ హోటల్‌లో రెండు వెజ్ బిర్యానీలు కొని, పార్సిల్ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లి తింటుండగా ఓ దాంట్లో కేవలం ప్లెయిన్ రైస్, కొన్ని చికెన్ ముక్కలు రావడంతో ఆశ్చర్యానికి గురై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు మంగళవారం షాగౌస్ హోటల్‌లో తనిఖీలు చేశారు.

పరిశుభ్రత మెరుగుపర్చుకోవాలని నోటీసు ఇస్తామని తెలిపారు. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడం తీవ్రమైన అంశం అని, నోటీసు ఇస్తామనడం ఎంతవరకు సబబు అని వినియోగదారుడు ఫుడ్‌సేప్టీ అధికారి రాజేశ్వరిని ప్రశ్నించగా.. రిపోర్టును డిజిగ్నేటెడ్ అధికారికి సమర్పిస్తామని ఆయన సూచన మేరకు నడుచుకుంటామని తెలిపారు. సుమారు పదిరోజుల తర్వాత తనిఖీలు నిర్వహించడం ఏంటని అడుగగా.. తాను కార్వాన్, గోషామహల్ సర్కిళ్లకు ఇన్‌చార్జిగా ఉన్నానని, తమ వద్ద సిబ్బంది కొరత ఉన్నదని రాజేశ్వరి తెలిపారు.