20-02-2025 01:15:08 AM
జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 19: శివాజీ జయంతిని పురస్కరించు కొని జగిత్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాలలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 36వ వార్డు ముంచీల భావి వద్ద గల శివాజీ విగ్రహానికి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, బిజెపి నాయకురా లు భోగ శ్రావణి పూలమాలలు వేసి నివాళులర్పించి హిందూ ధర్మ రక్షణ కోసం శివాజీ చేసిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు.
విహెచ్‌పి ఆధ్వర్యంలో...
విదేశీయ, విదర్మీయ పాలనను అంతమొందించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాటం చేసిన యోధుడు చత్రపతి శివాజీ అని సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ అన్నారు. చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్థానిక గీత విద్యాలయం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి, శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త గా పాల్గొన్న గంగాధర్ మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన మొగల్ సామ్రాజ్యాన్ని, ఆదిల్ షాహి, నిజాం షాహి రాజ్యాలను ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర యోధుడు శివాజీ అని అన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన శివాజీ తోటి గిరిజనులైన మావళీలలో దేశభక్తిని, స్వరాజ్య భావనను నింపి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సైన్యంగా తీర్చిదిద్దిన వ్యక్తి శివాజీ అని తెలిపారు.
పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం, పరిపాలన దక్షత, యుద్ధ నైపుణ్యం వంటి గుణాలలో శివాజీకి సాటి ఎవరూ లేరని అన్నారు. శివాజీ స్ఫూర్తిని చాటి చెప్పడం కోసం ప్రతి సంవత్సరం శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత సురక్షా సమితి రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎ సి ఎస్ రాజు, విశ్వహిందూ పరిషత్ నాయకులు రాములు, సంతోష్, అరుణ్, వికాస్ రావు, మాజీ కౌన్సిలర్ రాజకుమార్, రాము, రామ్మోహన్, గడ్డల లక్ష్మి, బిట్టు తదితరులు పాల్గొన్నారు.