calender_icon.png 1 March, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు

01-03-2025 07:07:12 PM

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి భీమ్ భరత్

చేవెళ్ల: కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు తప్పనిసరిగా పదవులు వస్తాయని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి పామెన భీమ్ భరత్(Congress Constituency In-Charge Bhim Bharat) స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మీటింగ్ లో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. శనివారం షాబాద్ మండలం కొమురం బండలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయ కొత్త చైర్మన్ చేవెళ్ల వెంకటయ్యతో పాటు పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తాను గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ  కాగ్రెస్ ఇన్ చార్జి హోదాలో ఎంతో మంది నాయకులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. 

పీసరి సురేందర్ రెడ్డి ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ కోసం నిలబడ్డాడని, అందుకే ఆయనకు సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అవకాశం వచ్చిందన్నారు.  సీనియర్ నేతైన వెంకటయ్య కు ఆలయ కమిటీ చైర్మన్ గా, మరి కొంత  మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కిందన్నారు.  గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి మోయలేని భారం మోపినా... ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికే ప్రతి గ్రామానికి సీసీ రోడ్ల కోసం రూ.5 లక్షలు మంజూరు చేశామని, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద మరో రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు రీబీటీ కింద రోడ్లు బాగు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని మాటిచ్చారు.