గుకేశ్, డింగ్ లిరెన్‌పైనే అందరి కళ్లు
సింగపూర్: ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌లో ఎవరు ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించనున్నారనేది తేలిపోనుంది.
ప్రపంచ చెస్ టైటిల్ కోసం 64 గళ్ల చదరంగం బోర్డుపై తమ పావులతో ఎత్తులు వేసేందుకు ఈ ఇద్దరు యోధులు సిద్ధమయ్యారు. ప్రతిష్ఠాత్మక చెస్ చాంపియన్‌షిప్ 2024 వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. నేటి నుంచి జరగనున్న పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌తో భారత యువ సంచలనం గుకేశ్ తలపడుతుండడంతో అందరి కళ్లు అతడిపైనే నెలకొన్నాయి.
ఒకవేళ డింగ్ లిరెన్‌పై గుకేశ్ విజయం సాధిస్తే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసిక్ చాంపియన్‌షిప్స్‌లో టైటిల్ సాధించిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాండిడేట్స్ చెస్ టోర్నీ గెలవడంతో ప్రపంచ టైటిల్ కోసం 32 ఏళ్ల లిరెన్‌తో పోటీపడే అవకాశానిన గుకేశ్ అందుకున్నాడు. ఆసియాకే చెందిన ఇద్దరు గ్రాండ్‌మాస్టర్ల మధ్య ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్ జరగడం 138 ఏళ్లలో ఇదే తొలిసారి.
నేటి నుంచి డిసెంబర్ 12 వరకు 14 రౌండ్ల పాటు ఇద్దరి మధ్య గేమ్ సాగనుంది. రోజుకో గేమ్ నిర్వహిస్తారు. ప్రతి మూడు రౌండ్ల తర్వాత ఒకరోజు విశ్రాంతి ఉంటుంది. గేమ్ గెలిస్తే ఒక పాయింట్.. డ్రా చేసుకుంటే 0.5 పాయింట్లు లభిస్తాయి. అన్ని రౌండ్లు ముగిసిన తర్వాత ఇద్దరి ఆటగాళ్ల స్కోర్లు సమంగా ఉంటే విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహిస్తారు.