వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఈనెల 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గత నెల 28వ తేదీన ప్రారంభోత్సవం జరగాల్సి ఉన్నా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వాయిదా పడిన విషయం తెలిసిందే.
తాజాగా 6వ తేదీన ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ టెర్మినల్‌ను రూ.430 కోట్లతో అత్యంత అధునా తనంగా నిర్మించారు. దీని నిర్మాణం ద్వారా మహా నగరంలో రైళ్ల ట్రాఫిక్ రద్దీ నియంత్రణతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీలవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
చర్లపల్లి టెర్మినల్ నుంచి నిత్యం 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని, భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే గూడ్స్ రైళ్ల రాకపోకలకు సైతం ఈ టెర్మినల్ కేంద్రంగా మారు తుందన్నారు. దీంతో ప్రయాణికులకు సౌలభ్యంతో పాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూడా ఈ టెర్మినల్ ఉపయోగపడు తుందని చెప్పారు.
ప్రధానికి తెలంగాణపై ప్రత్యేక అభిమానం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైల్వే ట్రాక్ ల నిర్మాణం, అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ రైళ్ల ప్రారంభోత్సవం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేవలం మోదీ ప్రభుత్వానికే సాధ్యమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా రూ.32 వేల కోట్లు కేటాయించి అనేక రైల్వేలైన్లను ఆధునీకరించడంతో పాటు 5 వందే భారత్ రైళ్లను కేటాయించిందన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ఉన్న ప్రత్యేక అభిమానానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2024--25 బడ్జెట్ లో తెలంగాణ రైల్వేకు రూ.5,336 కోట్ల నిధులను తమ ప్రభుత్వం కేటాయించిందన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రూ.720 కోట్లు, హైదరాబాద్ స్టేషన్‌కు రూ. 350 కోట్లు కేటాయించి ఆధునీకరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ర్టంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సహకరించకపోయినా చర్లపల్లి టెర్మినల్‌ను పూర్తిచేశామని తెలిపారు.