calender_icon.png 7 January, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

06-01-2025 01:34:37 AM

  1. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  2. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను  ప్రధాని నరేంద్రమోదీ సోమవారం జాతికి అంకితం చేయనున్నారు.  ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.

చర్లపల్లిలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సోమన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొననున్నారు. దేశంలోని పలు రైల్వే ప్రాజెక్టులతో పాటు చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభిస్తారు.

రూ.430 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తుండడంతో నగరంలో రైళ్ల  ట్రాఫిక్ రద్దీ సమస్యలు తీరనున్నాయి. ఈ టెర్మినల్  ప్రారంభంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే టెర్మినల్స్‌లో ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గే అవకాశం ఉంది.

చర్లపల్లి నుంచి ప్రారంభంలో 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే వర్గాలు వివరించాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనుంది. 

నేటి నుంచి పలు రైళ్ల రాకపోకలు..

చెన్నై సెంట్రల్- హైదరాబాద్ మధ్య నడిచే (రైలు నెం.12603/12604) ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే (రైలు నెం. 12589/12590) ఇకపై చర్లపల్లి నుంచే నడుస్తాయి. అలాగే సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ మధ్య నడిచే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు గుంటూరు- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చర్లపల్లిలో ఆగనున్నాయి. టెర్మినల్ ప్రారంభం తర్వాత మిగతా రైళ్లను కూడా ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.