10-12-2024 02:08:23 AM
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సోమవారం హైకోర్టులో షాక్ తగిలింది. పౌరసత్వానికి సంబంధించి కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
చెన్నమ నేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం 2019లో ఇచ్చిన ఉత్తర్వులు సబబేనని తేల్చింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉందంటూ కీలకతీర్పును వెలువరించింది. అంతేకాకుండా అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకుగాను చెన్నమనేనికి రూ.30 లక్షల భారీ జరిమానా విధించింది.
ఆ మొత్తంలో రూ. 25 లక్షలను గత 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న పిటిషనర్, (ప్రభుత్వ విప్) ఆది శ్రీనివాస్‌కు చెల్లించాలంది. మిగిలిన రూ.5 లక్షలు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలంది. జర్మనీ దేశ పౌరసత్వం ఉందన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఏకీభవించింది.
ఇప్పటివరకు తప్పుడు పత్రాలతో భారత పౌరుడినని చెప్పి 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారని తప్పుపట్టింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై చెన్నమనేని రమేశ్ 2019లో దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
పౌరసత్వం జారీచేసిన ఉత్తర్వులను పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10.3 ప్రకారం పునఃపరిశీలించాలని, పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చెన్నమనేని 15 ఏండ్లుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు.
సెక్షన్ 10.3 ప్రకారం పునఃపరిశీలిం చాలన్న ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం పౌరసత్వాన్ని తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందంటూ 2019లో వేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొంది ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ బి.విజయసేనారెడ్డి సుదీర్ఘంగా విచారణ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం సోమవారం తీర్పుచెప్పారు.
జర్మనీ పౌరసత్వం లేదని ధ్రువీకరించడానికి జర్మనీ ఎంబసీ చెన్నమనేనికి ఎలాంటి పత్రాన్ని ఇవ్వలేదని గుర్తుచేశారు. జర్మనీ పౌరసత్వం లేదని ఎంబసీ ధ్రువీకరించలేదన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చెన్నమనేని సమర్పించలేదన్నారు. జర్మనీ పౌరసత్వాన్ని జర్మనీ ఎంబసీ కి స్వాధీనంచేసి ఆ దేశ పౌరసత్వాన్ని రద్దు చేసు కున్నట్లుగా చెన్నమనేని సైతం ఎలాంటి ఆధారాలను సమర్పించలేదన్నారు.
దీనికి తోడు కేంద్రం ఇచ్చిన వివరా లను పరిశీలిస్తే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జర్మనీ పౌరసత్వం మీదనే 40సార్లుకుపైగా జర్మనీ వెళ్లివచ్చారన్నారు. ఆ దేశ పౌరసత్వం ఉన్న కారణంగానే ఆ విధంగా వెళ్లివచ్చారన్నారు. ఈ విషయాలపై కోర్టులను తప్పు దోవ పట్టిస్తూ గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగారని ఆక్షేపించారు. చెన్నమనేనికి భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను సమర్ధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.
ఇదీ అసలు కథ..
చెన్నమనేని తనకు భారత పౌరసత్వం కల్పించాలంటూ 2008లో దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత ఏడాది ఫిబ్రవరిలో పౌరసత్వాన్ని పొందారు. నిబంధనల ప్రకారం భారత పౌరసత్వం పొందేందుకు అప్లికేషన్ పెట్టుకోడానికి ముందు 12 నెలలు భారత దేశంలో నివాసం ఉండాలి. చెన్నమనేని 96 రోజులు మాత్రమే ఉన్నారంటూ అది శ్రీనివాస్ ఆరోపణ.
ఈ నేపథ్యంలో భారత పౌరసత్వం పొందడం చెల్లదంటూ కేంద్రానికి అది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేగా ఉంటూ కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారనే ఫిర్యాదుపై కేంద్రం చెన్నమనేనికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ నోటీసును సవాలు చేస్తూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు. మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారు.
ఆ తర్వాత ఒకటి తర్వాత మరొకటి పిటిషన్ వేస్తూ వచ్చారు. ఆది శ్రీనివాస్ ఫిర్యాదుపై విచారణ నిమిత్తం కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం 2017లో చెన్నమనేని పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ వ్యవహారాన్ని పునఃపరిశీలించేలా కేంద్రాన్ని చెన్నమనేని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది.
చెన్నమనేని అభ్యర్థనను కేంద్రం తిరస్కరిండచంతో 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన హైకోర్టు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ పౌరసత్వం చట్టంలోని సెక్షన్ 10.3 ప్రకారం ప్రజాప్రయోజనాల అంశాలతో సహా అన్ని అంశాలను పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
అనంతరం చెన్నమనేని అభ్యం తరాలన్నింటినీ పరిశీలించి అంతిమంగా 2019 నవంబర్ 20న పౌరసత్వం రద్దుచేస్తూ మరోసారి కేంద్ర సర్కార్ ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మళ్లీ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేసి మధ్యంతర ఉత్తర్వులు పొందారు.
ద్వంద్వ పౌరసత్వం వివాదం కొనసాగుతుండగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మధ్యంతర ఉత్తర్వులతోనే ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇప్పుడు సోమవారం హైకోర్టు తీర్పుతో చెన్నమనేని పౌరసత్వం రద్దయ్యింది. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది.
న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్
చెన్నమనేని రమేశ్ భారతీయుడు కాదనీ, జర్మనీ పౌరుడనీ మొదటి నుంచి చెబుతున్నా.. ఎమ్మెల్యేగా గెలుపొందిన రమేశ్ ఎన్నిక చెల్లదంటూ కోర్టుకు వెళ్లానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని తప్పుడు పత్రాలతో తప్పుదోవ పట్టించాడని..
రాజకీయ, ఆర్థికబలంతో తనను బలహీన పరిచినప్పటికి, మొక్కవోని పట్టుదలతో న్యాయం, ధర్మాన్ని నమ్ముకొని పోరాటం చేశానన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకమే ఈ రోజు తనకు న్యాయం జరిగేలా చేసిందన్నారు. రమేశ్ ఫిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని, తన న్యాయ పోరాటం గెలిచిందని శ్రీనివాస్ చెప్పారు.