చెన్నై: ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో బలమైన గాలులతో వర్షాలు పడుతున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. చెన్నైలో మోటరు పంపులతో వరద నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. ఫెంగల్ తుఫాను కారణంగా వచ్చే 48 గంటలపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం సంసిద్ధతను సమీక్షించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో తుఫాను ఫెంగల్ శనివారం మధ్యాహ్నం పుదుచ్చేరికి దగ్గరగా, గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సైక్లోనిక్ విభాగం ఐఎండీ హెడ్ ఆనంద దాస్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పుదుచ్చేరి, కాంచీపురం సహా తమిళనాడులోని వివిధ జిల్లాల్లో శనివారం అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. ఇదిలావుండగా, ఫెంగల్ తుఫాను సమీపిస్తున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని పుదుచ్చేరి మత్స్య శాఖ మత్స్యకారులకు హెచ్చరించింది. నష్టాన్ని నివారించడానికి మత్స్యకారులు తమ పడవలు, పరికరాలను ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని సూచించింది.