calender_icon.png 27 November, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీలో రసాయన వ్యర్థాల డంపింగ్

27-11-2024 01:07:29 AM

  1. బిల్డింగ్ మెటీరియల్ ముసుగులో దర్జాగా దందా
  2. నదిలోకి ప్రత్యేకంగా పైపులైన్ ఏర్పాటు 
  3. షాద్‌నగర్, కొత్తూరు నుంచి తీసుకొచ్చి నదిలో విడుదల 
  4. అడ్డుకున్న స్థానికులు.. ఒక లారీ పట్టివేత

రాజేంద్రనగర్, నవంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందీకరణను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అం దుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. సుమారు లక్షన్నర కోట్లతో ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం సర్కారు ఆశయానికి గండికొట్టేలా ఉంది.

కొందరు దుండగులు వివిధ ప్రాంతాల నుంచి అత్యంత ప్రమాదకర రసాయనాలను తీసుకొచ్చి మూసీలో పారబోస్తున్నా అడిగే నాథుడు లేకుండా పోయాడు. ఏళ్లుగా ఈ దందా సాగుతున్నా ఎవ రూ అడ్డుకోకపోవడం గమనార్హం. చివరకు స్థానికులు అడ్డుకొని ఓ లారీని పట్టుకోగా మరో రెండు లారీలతో డ్రైవర్లు పరారయ్యారు.

ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున అత్తాపూర్ డివిజన్ పరిధిలోని మూసీ పరీవాహకంలో పవిత్ర త్రివేణి సంగమం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన లింగారెడ్డితోపాటు పలువురు అయ్య ప్ప మాల ధరించి లంగర్‌హౌస్‌లోని సంగం ఆలయంలో ఉంటున్నారు.

సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒంటిగంట సమయంలో తీవ్రమైన రసాయనాల వాసన రావడంతో బయటకు వచ్చి చూడగా మూసి నదికి మరోవైపు అత్తాపూర్ డివిజన్‌లోకి వచ్చే మూసీ పరివాహకంలో కొన్ని లారీలు కనిపించాయి. అక్కడ ఓ వ్యక్తి కొన్ని ఏళ్లుగా బిల్డింగ్ మెటీరియల్ విక్రయిస్తున్నాడు. అక్కడ లారీ ట్యాంకర్లు కనిపించడంతో లింగారెడ్డితోపాటు పలువురు అక్కడికి చేరుకొని ప్రశ్నించగా, మొదట వారు దబాయించారు.

ఘటనా స్థలానికి వెళ్లి చూడగా డ్రైనేజీ వాటర్ అని చెప్పారు. ఇక్కడ ఏదో జరుగుతుందని అనుమానించి అయ్యప్ప భక్తులు అక్కడికి వెళ్లి చూడగా రెండు లారీలతో డ్రైవర్లు పరారయ్యాయి. మరో లారీ అక్కడే ఉండటంతో పట్టుకున్నారు. వెంటనే డయల్ 100కు కాల్ చేయడంతో రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి వచ్చి లారీ ట్యాంకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

అన్నిశాఖలకు మామూళ్లు

కొన్నిఏళ్లుగా జరుగుతున్న ఈ దందా ఆయా శాఖల అధికారులకు తెలుసని స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు. ప్రతీనెల వారికి అమ్యామ్యాలు అందుతాయని మండిపడ్డారు. మూసీ నది ఒడ్డున చాలా స్థలాన్ని ఓ అక్రమార్కుడు దర్జాగా కబ్జా చేసి ఏళ్లుగా లక్షల రూపాయలు దండుకుంటున్నా రెవెన్యూ అధికారులకు తెలియకపో వడం గమనార్హం.

గతంలో ఓసారి సర్వే చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు తెలిపారు. 

ప్రత్యేకంగా మ్యాన్‌హోల్

అక్రమార్కులు ఏళ్లుగా ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. దందా నిర్వహిస్తున్న వ్యక్తి పార్కింగ్ ప్రాంతంలో ప్రత్యేకంగా మ్యాన్‌హోల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మూసీలోకి పైపులైన్ వేసి అందులోకి పంపుతున్నారు. ఈ దందా చేసే వ్యక్తి ఒక్కో ట్యాంకర్ నుంచి 25 వేల కంటే ఎక్కువ వసూలు చేస్తూ ఒక్కోరాత్రికి లక్షకు పైగానే గడిస్తున్నాడు. 

5 లక్షలు ఇచ్చేందుకు కాళ్లబేరం

అక్రమార్కులు లారీలను అడ్డుకున్న వారి వద్ద కాళ్ల బేరానికి వచ్చారు. రూ. 5 లక్షలు ఇస్తామని.. విషయం ఇంతటితో వదిలేయాలని లింగారెడ్డితోపాటు పలువురిని బతిమాలారు. వారు ఎంతకూ వినలేదు. అక్కడా ఓ వ్యక్తి కొంతస్థలాన్ని లీజుకు తీసుకొని బిల్డింగ్ మెటీరియల్ విక్రయిస్తున్నాడు.

ఈ ముసుగులో రాత్రి సమయంలో ప్రతీరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత షాద్‌నగర్, బాలానగర్, కొత్తూరు తదితర ప్రాంతాల నుంచి కెమికల్ కంపెనీల నుంచి ఐదారు ట్యాంకర్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాలను తీసుకొచ్చి పార్కింగ్ ప్రాంతంలో నిలిపి మూసీ నదిలోకి ప్రత్యేక పైపు లైన్ ద్వారా విడుదల చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

కఠిన చర్యలు తీసుకోవాలి

ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. పూర్తిస్థాయిలో విచార ణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ట్యాంకర్ లారీలు ఏ కంపెనీవి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు అనే విషయాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు.

అనంతరం రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని అన్నారు. ఒక లారీ సీజ్ చేశామని, మరోరెండు లారీలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.