calender_icon.png 6 October, 2024 | 8:01 PM

మున్నేరుకు కెమికల్ గండం?

06-10-2024 12:07:31 AM

  1. జ్వరాలు, దురదతో జనం దవాఖాన పాలు 
  2. కెమికల్ కలిపిన నీరు తాగి పశువులు మృతి 
  3. ఆందోళనలో మున్నేరు పరివాహక గ్రామాలు
  4. రెడ్‌హ్యాండెడ్‌గా కెమికల్ ట్యాంకర్ పట్టివేత 
  5. ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు 

ఖమ్మం , అక్టోబర్ 5 (విజయక్రాంతి): అసలే వరదలతో సర్వం కోల్పోయి అష్టకష్టాలు పడుతున్న మున్నేరు పరివాహాక ప్రాంత ప్రజలకు.. కెమికల్ వ్యర్థాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్, త్రీటౌన్ ప్రాంతంతోపాటు కోటనారాయణపురం, వెంకటగిరి, గుదిమళ్ల, ధ్వంసలాపురం, కొత్తూరు కాలనీ తదితర ప్రాంతాలకు ప్రధాన మంచినీటి వనరుగా ఉన్న మున్నేరులో పెద్ద ఎత్తున కెమికల్ వ్యర్థాలను కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వదులుతున్నారు.

మంచినీరు కలుషితమై, పలు రకాల రోగాలకు కారణమవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరులో కెమికల్ వ్యర్థాలు కలవడం వల్ల జ్వరాలు, దురద, అంటు రోగాలతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ఆ నీటిని తాగిన పశువులు మృత్యువాత పడుతుండటంతోపాటు పంట పొలాలకు ముప్పు పొంచి ఉందని తెలియడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

హైదరాబాద్ నుంచి తెచ్చి..

ఖమ్మం నగరంలోని వెంకటగిరి, గుదిమళ్ల గ్రామాల ప్రజలకు కెమికల్ ట్యాంకర్లు ప్రాణసంకటంగా మారాయి. హైదరాబాద్ సమీపంలోని  ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి కెమికల్ వ్యర్థాలను భారీగా ట్యాంకర్లలో ఖమ్మం తీసుకువచ్చి ప్రకాశ్‌నగర్ సమీపంలోని మున్నేరులో  వదులుతున్నారు.

వీటిని గుంటూరు సమీపంలో వదలాల్సి ఉండగా, అక్కడిదాకా వెళ్లకుండానే మార్గం మధ్యలోని ఖమ్మం వచ్చి, మున్నేరులో వ్యర్థాలు వదులుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆయా బాధిత గ్రామాల ప్రజలు కెమికల్ వ్యర్థాలు తీసుకువచ్చే ట్యాంకర్లను పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పదే పదే ట్యాంకర్లలో వ్యర్థాలు తీసుకువస్తుండటంతో గ్రామస్థులు ఏకంగా గస్తీ చేపట్టారు.

గత ఆగస్టులో ఓ ట్యాంకర్‌ను పట్టుకొని ఖమ్మం రూరల్ పోలీసులకు అప్పగించినా వారు పట్టించుకోవట్లేదని తెలిసింది. రెండు రోజుల క్రితం ఓ ట్యాంకర్‌లో కెమికల్ వ్యర్థాలు తెచ్చి, మున్నేరులో వదులుతుండగా గుదిమళ్ల, వెంకటగిరి ప్రజలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గతంలో పోలీసులకు అప్పగిస్తే ట్యాంకర్‌ను వదిలిపెట్టడం వల్ల మళ్ళీ మున్నేరులో రసాయనాలు వదులుతున్నారని, ఈసారి ట్యాంకర్‌ను కలెక్టరేట్‌కు తరలించాల్సిందేనని గ్రామస్థులు పట్టుబట్టారు. తాజాగా ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పలు గ్రామాల ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడిరావడంతో ఈసారి పోలీసులు హైదరాబాద్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి, కృష్ణ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులను వదిలేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని, వారికి శిక్షపడేలా చూడాలని గ్రామస్థులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.