27-03-2025 11:31:40 PM
చెన్నూర్ (విజయక్రాంతి): తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కోటపల్లి మండలంలోని రాపనపల్లి చెక్పోస్ట్ వద్ద జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ తో గురువారం రాత్రి 10.15 గంటలకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర వెళ్లే, అక్కడ నుంచి చెన్నూరు వైపు ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా నార్కోటిక్ ఎనాలిసిస్ డాగ్ ద్వారా పోలీస్ సిబ్బందితో అన్ని వాహనాలను, సామాగ్రిని పరిశీలించారు.
గంజాయిని అరికట్టడమే లక్ష్యంగా..
గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టామని జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగానే పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను అరికడుతున్నామన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, టీ ఎస్ ఎస్ పి సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.