calender_icon.png 27 December, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డుమ్మాలకు చెక్!

03-12-2024 12:20:09 AM

  1. డీఎడ్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్
  2. విద్యార్థులు, అధ్యాపకుల హాజరుపై ఎస్‌సీఈఆర్టీ ఫోకస్
  3. త్వరలో అన్ని కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు

మెదక్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యను గాడిలో పెట్టేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) దృష్టి సారించింది. డీఎడ్ విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఈ విధానం అమలులో ఉంది. తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో అభ్యసించే కొంతమంది ఛాత్రోపాధ్యాయులు (విద్యార్థులు) తరగతులకు ఎగనామం పెడుతున్నారు.

చాలా కళాశాలల్లో తరగతులకు హాజరుకాకుండా యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చు కుంటున్నారు. ఇందుకోసం డబ్బులు ముట్టజెబుతున్నారు. ఇలాంటి అక్రమా లకు చెక్ పెట్టేందుకు ఎస్‌సీఈఆర్టీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు లోకి తెచ్చింది. 

తరగతులకు ఎగనామం...

డీఎడ్ కళాశాలల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ డైట్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జిల్లాల్లోని ఒకటి, రెండు కళాశాలల్లో విద్యార్థులు ప్రతిరోజు వచ్చే విధంగా ఆ యాజమాన్యాలు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా కళాశాలల్లో తరగతులకు గైర్హాజరైతే వారి నుంచి డబ్బులు తీసకుంటున్నట్లు సమాచారం.

హాజరు వేసేందుకు రూ.20వేలు, రికార్డుల కోసం రూ.10వేలు, పరీక్షల సమయంలో మరో రూ.10వేల చొప్పున తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాఠశాల మాదిరిగానే డీఎడ్ తరగతులు కొనసాగుతాయి. ప్రథమ సంవత్సరంలో 40 రోజులు, ద్వితీయ సంవత్సరంలో 60 రోజుల పాటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు తరగతులు బోధించాల్సి ఉంటుంది.

అలాగే బోధించిన విషయాలపై రికార్డులు రాయాలి. కానీ డబ్బులు ముట్టజెప్పిన వారికి కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. వార్షిక పరీక్షల సమయంలో సైతం డబ్బులు తీసుకొని పరీక్షలు రాయిస్తున్నారే ఆరోపణలున్నాయి. 

పర్యవేక్షించని అధికారులు..

మెదక్ జిల్లాలో ప్రభుత్వ డీఎడ్ కళాశాలతో పాటు ఆరు ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్‌తో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్  కళాశాలల్లో తగినంత లెక్చరర్లు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపంతో యాజమాన్యాల ఆగడాలు మితిమీరుతున్నాయని తెలుస్తోంది.

లెక్చరర్లు లేకుండానే..

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో చాలా డైట్ కళాశాలలు పూర్తిస్థాయి సిబ్బంది లేకుండానే కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి డైట్ కళాశాలకు ప్రిన్సిపాల్‌తో పాటు 8 మంది లెక్చరర్లను నియమించుకోవాలి. అయితే ఒకరిద్దరితో విద్యాబోధన చేయించి మమ అనిపిస్తున్నారనే విమర్శలున్నాయి.

దీంతో విద్యార్థులు స్వతహాగా చదువుకొని పరీక్షలు రాస్తున్నారే తప్పా వారు పూర్తిస్థాయిలో జ్ఞానం పొందలేకపోతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుంటూ గమ్మునుండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించారు. 

ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు ఏర్పాట్లు

ఎస్‌సీఈఆర్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ డైట్‌తో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని డీఎడ్ కళాశాలల్లో త్వరలో ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది వివరాలను ఎస్‌సీఈఆర్టీకి పంపించాం. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలి. లేకుంటే పరీక్షలకు అనుమతించం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే ప్రైవేట్ కళాశాలలను తనిఖీ చేస్తున్నాం. 

 రమేశ్, ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్, మెదక్