calender_icon.png 25 September, 2024 | 3:48 PM

దరఖాస్తులు పరిశీలించి ఎన్‌రోల్‌మెంట్ తేదీ ఖరారు చేయండి

25-09-2024 12:24:21 AM

రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): న్యాయవాదులుగా ఎన్‌రోల్ చేసుకోవడానికి లాడిగ్రీ పొందిన అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి ఎన్‌రోల్ మెంట్ తేదీని నిర్ణయించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) జూలై 31న రాసిన లేఖ ఆధారంగా ఎన్‌రోల్ మెంట్ నిలిపివేస్తూ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆగస్టు 5న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన జీ రాధిక మరికొందరు వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2024లో న్యాయశాస్త్రం పూర్తి చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్ పొందిన ఎన్‌రోల్ మెంట్ అవకాశం దక్కడం లేదన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం న్యాయవాదుల ఎన్‌రోల్ మెంట్ చేసుకునే స్వేచ్ఛను రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు కల్పిస్తూ బీసీఐ ఆగస్టు 6న లేఖ రాసిందని తెలిపారు.

రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం స్వీకరించిన దరఖాస్తులను సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం యూనివర్సిటీలకు పంపామని, అవి అందిన వెంటనే ఎన్‌రోల్ మెంట్ తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిశీలించి ఎన్‌రోల్ మెంట్ తేదీని నిర్ణయించాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను ముగించారు.