కొన్ని పదార్థాలు మీదకు పదే పదే మనసు మళ్లడం, మనం తీసుకుంటున్న ఆహారంలో పోషక లోపానికి సంకేతం. ఫుడ్ క్రేవింగ్స్ సమయంతో సంబంధం లేకుండా ఇష్టమొచ్చినట్టు తినాలి అనిపించేలా చేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనవి స్వీట్స్. ఈ క్రేమింగ్స్ ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకుందాం..
ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటివి తీపి తినాలిపించడానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించటం కోసం తీపి మీదకు మనసు మళ్లుతుంది. ఇలాంటప్పుడు స్వీట్ల జోలికి వెళ్లకుండా మూల కారణాల్ని సరిదిద్దటం మీద మనసు పెట్టాలి. స్వీట్ల మీద ఇష్టం పెరగడానికి వ్యాయామం కొరవడడం మరో కారణం. శరీరం యాక్టివ్‌గా లేనప్పుడు బద్దకం ఆవరిస్తుంది.
దాంతో మనసు కప్ కేక్స్, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. కాబట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండటం తప్పనిసరి. షుగర్ క్రేవింగ్స్‌కి డీహైడ్రేషన్ మరో కారణం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలు తినాలనిపిస్తుంది. కాబట్టి తీపి తినాలినిపించినప్పుడు నీళ్లు తాగాలి. తీపి తినాలనే కోరికను కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ చిట్కాలు పాటించాలి.
చాక్లెట్లు తినాలనిపిస్తే 70 శాతం డార్క్ చాక్లెట్ రెండు ముక్కలు మాత్రమే తినాలి. ఆలు చిప్స్, స్వీట్ కార్న్ తినొచ్చు. రెండు ఖర్జూరాలు, రెండు అప్రికాట్స్, నాలుగు ఎండుద్రాక్ష, రెండు అంజీర్ వంటివి తినడం వల్ల కూడా క్రేవింగ్స్ తగ్గుతాయి.