calender_icon.png 3 October, 2024 | 4:44 PM

గూడ్స్ షెడ్ తరలింపు పరిశీలించండి

03-10-2024 02:29:46 AM

రైల్వేకు హైకోర్టు ఉత్తర్వులు 

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): సనత్‌నగర్‌లోని రైల్వే గూడ్స్ షెడ్ తరలింపుపై 2009, 2016లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ఆపరేషనల్ సీనియర్ మేనేజర్ చేసిన సిఫారసులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవా లని రైల్వే శాఖను హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకునే ముందు రైల్వేశాఖ విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిం చింది.

సనత్‌నగర్ గూడ్స్ షెడ్‌ను ప్రత్యామ్నాయ స్టేషన్‌కు తరలించేలా ఆదేశాలివ్వా లంటూ డీ ఉదయ్మ కుమార్ మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని జస్టి స్ నగేశ్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టా రు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్ శ్రీధర్ వాదనలు వినిపిస్తూ.. రైల్వే నిర్వహించే గూడ్స్ షెడ్ కార్యకలాపాల వల్ల రద్దీ పెరిగిందన్నారు.

నిత్యం వాహనాల రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో అది శివారు ప్రాంతమని, ఇప్పుడు హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉందని అన్నారు. దానికి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని, 2009,  2016లో సనత్‌నగర్ కార్యకలాపాలను మౌలాలి, చర్లపలి,్ల నాగలపల్లి, శంకరపల్లి స్టేషన్లకు తరలించాలని రైల్వే సీనియర్ డీఎం సిఫార్సు చేశారని వివరించారు.

ఇప్పటివరకు ఆ సిఫార్సులు అమలు కాలేదని తెలిపారు. రైల్వే తరపు న్యాయవాది వాదలను వినిపిస్తూ.. ఆహార ధాన్యాలు, ఎరువులు, స్టీల్, సిమెంట్, ఉప్పు తదితరాలన్నీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రవాణా జరుగుతుంటాయని వివరించారు. రోజుకు 1500 మంది కూలీలు, 500 లారీలు సేవలందిస్తుంటారన్నారు.

జీడిమెట్ల, బాలానగర్, చందానగర్, ఫతేనగర్ వం టి పారిశ్రామికవాడలుకార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా తదితర మెట్రో ప్రాంతాల్లో 10కిపైగా గూడ్స్ షెడ్లు ఉన్నాయని తెలిపారు. తరలింపు జరిగితే స్థానికంగా దాని ప్రభావం పరిశ్రమలపై ఉంటుందని, ఎంతోమంది జీవన స్థితిగతులు మారిపోతాయని చెప్పారు.

ఇరుపక్షాల వాదనలను, రికార్డులను, స్థానికులు, ప్రజాప్రతినిధుల వినతి పత్రాలు పరిశీలించిన హైకోర్టు ,రద్దీ ఉన్న షెడ్లకు ప్రత్యామ్నాయాలు చూడాలని, దానికి ప్రోత్సాహకా లు ప్రకటించాలన్న విధాన నిర్ణయాన్ని రైల్వే శాఖ తీసుకుందని గుర్తుచేసింది. గతంలో రైల్వే డివిజనల్ సీనియర్ మేనేజర్ చేసిన సిఫారసులను పరిశీలించి, చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది.