19-02-2025 01:27:18 AM
మునుగోడు, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : చండూరు మున్సిపల్ వాసులకు త్వరలో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. అమృత 2.0 పథకం కింద చండూరు ముని సిపాలిటీకి రూ.9.80 కోట్లు నిధులు మం జూరవడంతో సమస్య తీరనుంది.
ఈ నిధు లతో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల పనులు పూర్తి చేసి తాగునీరు అందించనున్నారు. పనులను ఆగస్టులో స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రారం భించారు. ప్రస్తుతం పైపులైన్ల పనులు పూర్తి కావొచ్చాయి. నిబంధనల మేరకు మే నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రూ. 9.80 కోట్లతో పనులు
చండూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.9.80 కోట్లు మం జూరయ్యాయి. ఇందులో అమృత 2.0 పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం నిధు లు 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వానివి 30 శాతం, మున్సిపాలిటీ నుంచి మరో 20 శాతం నిధులున్నాయి.
ఈ నిధులతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించి అవసరానికి అనుగు ణంగా పైప్లైన్లు వేస్తున్నారు. ఇప్పటికే పట్టణం లో 11 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 13 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. నూతనంగా నిర్మిస్తున్న రెండు ట్యాంకులు, పాతవి కలిపి 20 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండడం తో ఇక సాగు నీటికి ఢోకా ఉండబోదు.
సరిపడా ట్యాంకులు లేకపోవడంతో...
మున్సిపాలిటీలో 10 వార్డులున్నాయి. 16 వేల వరకు ఓటర్లు ఉన్నారు. సరిపడా ఓవర్హెడ్ ట్యాంకులు లేకపోవడంతో పలు కాలనీల్లో తాగు నీటి సరఫరాకు కటకట ఏర్పడుతున్నది. ఆయా చోట్ల మిషన భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్లాంట్ల నీటిని కొనుక్కొని తాగాల్సి దుస్థితి. మరో మూడు నెలల్లో తాగునీటి సమస్య తీరనుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.