calender_icon.png 1 October, 2024 | 7:53 AM

సివరేజీ వర్రీకి చెక్

01-10-2024 01:35:12 AM

‘గ్రేటర్’లో సుమారు 7వేల కి.మీ మేర డ్రైనేజీ క్లీనింగ్

మ్యాన్‌హోళ్లలో డీసిల్టింగ్

రేపటి నుంచి 90 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సివరేజీ సమస్య, మ్యాన్ హోళ్లు పొంగి రోడ్లపై పారడం, వేసవిలో వాటర్ ట్యాంకర్ల సప్లు సమస్యను అధిగమించేందుకు జలమండలి కృషి చేస్తున్నది. అందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నది.

2న గాంధీజయంతి సందర్భంగా 90 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది. నగరవ్యాప్తంగా సుమారు 7 వేల కి.మీ మేర డ్రైనేజీ క్లీన్ చేయించనున్నది. దీనిపై ఇప్పటికే జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ అనేకసార్లు క్షేత్రస్థాయి క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేశా రు. ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి శుభ్రం చేయించాలని వారు నిర్ణయించారు.

గ్రేటర్ పరిధిలో మొత్తం 225 ఎయిర్‌టెక్ మిషన్లు ఉండగా, వాటి నిర్వహ ణ  సక్రమంగా లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో జలమండలి కస్టమర్ కేర్ భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 31,534 ఫిర్యాదులు, సెప్టెంబర్‌లో 26,287 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇంకుడు గుంత లేకుంటే ట్యాంకర్ ధర రెట్టింపు

గత వేసవిలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు 10 లోతుకు పడిపోయా యి. దీంతో అధికారులు ప్రజావసరాలకు దాదాపు 7లక్షల వాటర్ ట్యాంకర్లను సరఫ రా చేశారు. అలాగే ఒక్క సెప్టెంబర్ నెలలోనే 34,817 వాటర్ టాంకర్లను వినియోగించాల్సి వచ్చింది. వీటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

అందుకు ‘ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత’ అనే కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నారు. త్వరలో 42,784 ఇండ్లను తనిఖీ చేసి, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. జనవరి నుంచి వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకునే వినియోగదారుల ఇంట్లో తప్పకుండా ఇంకుడు గుంత ఉండాల్సిందే. లేకుంటే వారు వాటర్ ట్యాంకర్‌కు రెట్టింపు ధర చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది.