calender_icon.png 16 January, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్తు అంతరాయాలకు చెక్!

07-07-2024 12:05:00 AM

  1. జియోగ్రాఫికల్ సమాచార వ్యవస్థ ఏర్పాటు
  2. అమలు దిశగా విద్యుత్తు శాఖ కసరత్తు
  3. ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా కేంద్రంలో అమలు

మెదక్, జూలై 6 (విజయక్రాంతి): విద్యుత్తు అంతరాయాలకు చెక్ పెట్టేందుకు అధికారులు నూతన సాంకేతిక వ్యవస్థను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే తెలుసుకునేందుకు విద్యుత్తు సిబ్బందికి సమయం పడుతోంది. పరిష్కారం ఆలస్యం కావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగు పరిచేందుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌పీడీసీఎల్) నూతనంగా జియోగ్రాఫికల్ సమాచార వ్యవస్థను అందుబాటులోకి తేనుంది.

త్వరలోనే మెదక్ జిల్లావ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఓ ఫీడర్‌ను ఎంచుకొని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. మొదటి దశలో మెదక్ పట్టణ పరిధిలో ఉన్న 10 ఫీడర్లను బృందాలుగా ఏర్పడి మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు. ఏఈ, సిబ్బంది ఒక బృందంగా సబ్ ఇంజనీర్, సిబ్బంది మరో బృందంగా క్షేత్రస్థాయిలో అన్ని అంశాలపై సర్వే చేయనున్నారు. 

వివరాలు యాప్‌లో నమోదు..

మెదక్ జిల్లాలో 11 కేవీ ఫీడర్లు 484, 33 కేవీ ఫీడర్లు 70 ఉన్నాయి. ఆయా ఫీడర్లలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా సిబ్బంది వెళ్లి పరిష్కరించే విధంగా నూతన సాంకేతిక విధానం తెచ్చారు. జిల్లాలోని ఫీడర్లు, తీగల సైజు, స్తంభాల మధ్య దూరం, విద్యుత్తు లైన్ల ను తాకే చెట్ల వివరాలు, ఒక్కో ఫీడర్‌పై ఉన్న నియంత్రికల సంఖ్య, వాటి సామర్థ్యం, ఎన్ని విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయనే వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటు ఎక్స్ ఆర్మ్ ఇన్సులేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడ్ వివరాలు కూడా పొందుపరుస్తున్నారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా వివరాలు స్పాట్‌లోనే జియోగ్రాఫికల్ సమాచార యాప్‌లో నమోదు చేస్తారు. ఈ చర్యలతో ఏ ఫీడర్‌లో సమస్య తలెత్తిందో సిబ్బందికి సమాచారం వెళ్తుంది. వెంటనే అధికారులు సమస్య ఉన్న ప్రాంతానికి చేరుకొని మరమ్మతులు చేపడతారు. 

అంతరాయాలకు ఎన్నో కారణాలు..

ప్రస్తుతం విద్యుత్తు సరఫరాలో అంతరాయాలకు కారణాలు అనేకమున్నాయి. విద్యుత్ లైన్లు, స్తంభాలు కొన్ని వందల కిలోమీటర్ల పొడవు ఉండడంతో సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు సిబ్బందికి కష్టమవుతోంది. గాలికి చెట్ల కొమ్మలు తీగలకు తగలడం, పక్షులు వాలడం, పిడుగుపాటు, సాంకేతిక కారణాల వల్ల సరఫరా నిలిచిపోతుంది. ప్రస్తుత విధానం అమలైతే విద్యుత్ సిబ్బంది కష్టాలు తొలగిపోనున్నాయి. 

త్వరలోనే అమల్లోకి..

త్వరలో నూతన సాంకేతిక విధానం అమల్లోకి వస్తుంది. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి అమలు చేయనున్నాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే సర్వే పనులు చేపడతాం.

 వీ కృష్ణారావు, డీఈ, మెదక్