calender_icon.png 12 October, 2024 | 10:58 AM

కుంటి సాకులకు చెక్

30-09-2024 12:00:00 AM

విదేశీ ప్లేయర్లపై బీసీసీ‘ఐ’  

ఆరుగురిని అట్టిపెట్టుకోవచ్చు.. ఆర్‌టీఎంకూ ఓకే

ఇక నుంచి మ్యాచ్ ఫీజులు కూడా.. ఫారినర్ల ధన దాహానికి కల్లెం

* వాడెవ్వడు.. వీడెవ్వడు కోట్లు రాకుండా ఆపేదెవ్వడు అంటూ విర్రవీగిన ఫారిన్ ప్లేయర్లకు బీసీసీఐ ‘చెక్’ పెట్టింది. ఇకపై నుంచి వేలంలో పాల్గొని కుంటిసాకులు చెప్పే ఫారిన్ క్రికెటర్ల తాట తీసేందుకు కొత్త రూల్స్ తెచ్చింది. విదేశీ ప్లేయర్లపై ఇక నుంచి బీసీసీ‘ఐ’ పెట్టనుంది. 

విజయక్రాంతి ఖేల్ విభాగం: అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్న విదేశీ ప్లేయర్ల ధనదాహానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెక్ పెట్టింది. ఇకపై ఎవరైనా ఆటగాడు వేలంలో పాల్గొని.. సీజన్‌కు అందుబాటులో లేకపోతే అతడి మీద రెండేళ్ల పాటు నిషేధం విధించనున్నట్లు పేర్కొంది. రైట్ టూ మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డు ఆప్షన్‌ను ఈ సీజన్‌తో మరోమారు తీసుకొస్తున్నారు. 

ఆరుగురిని అట్టిపెట్టుకోవచ్చు.. 

ఈసారి ప్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను అలాగే ఉంచుకునే వెసులుబాటు ఉంది. ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చు. అలాగే మరొక ఆటగాడిని వేలంలో ఆర్‌టీఎం కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు చెల్లించాల్సిన డబ్బుల వివరాలను కూడా బీసీసీఐ వెల్లడించింది.

అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ. 18 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 14 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 11 కోట్లు చెల్లించాలి. ఇంకో ఇద్దరిని అట్టిపెట్టుకోవాలని అనుకుంటే వరుసగా 18,11 కోట్లు చెల్లించాలని తెలిపింది. ఏదైనా ప్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 75 కోట్లు ఖర్చు చేయాలి.

వారికి ఇంకా పర్స్‌లో రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి. వారు ఈ మొత్తంతోనే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్లలో ఒకరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అయి ఉండాలి. ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్న పర్వాలేదు. 

అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఎవరంటే.. 

గత కొద్ది రోజులుగా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ చర్చ బాగా జరుగుతోంది. అసలు అన్‌క్యాప్‌డ్ ఆటగాడు అంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మ్యాచ్ ఆడని, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పరిగణించబడతారు

విదేశీ ప్లేయర్ల ధనదాహానికి చెక్..

విదేశీ ప్లేయర్లు డబ్బులు ఎక్కువగా పొందేందుకు మెగా వేలం కాకుండా మినీ వేలంలో పాల్గొంటున్నారని చర్చ జరుగుతున్న వేళ.. బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏదైనా ఆటగాడు 2026, 2027 మినీ వేలంలో పాల్గొనాలంటే.. ఈ సారి మెగా వేలంలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అంతే కాకుండా వారు దక్కించుకునే మొత్తం కూడా పలు షరతులు విధించింది.

ఉదాహరణకు ఒక ప్రాంచైజీ ఒక టాప్ ఆటగాడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుని మరో ఆటగాడిని వేలంలో రూ. 15 కోట్లకు దక్కించుకుంటే తర్వాత వచ్చే మినీ వేలంలో విదేశీ ప్లేయర్‌ను ఎంతకు సొంతం చేసుకున్నా కానీ రూ. 15 కోట్లు మాత్రమే చెల్లిస్తారు.

ఒక వేళ రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుని వేలంలో ఒక ఆటగాడిని రూ. 20 కోట్లకు తీసుకుంటే మినీ వేలంలో విదేశీ ఆటగాడికి రూ. 18 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన మొత్తం బీసీసీఐ బ్యాంకు ఖాతాకు జమవుతుంది. 

మ్యాచ్ ఫీజులు కూడా.. 

ఇప్పటికే ఐపీఎల్‌కు బంగారు బాతు అనే పేరుం ది. ఇన్ని రోజులు వేలంలో పలికిన ధర తప్పా.. ప్రత్యేకంగా మ్యాచ్ ఫీజు లు చెల్లించేవారు కాదు. కానీ ఈ సీజన్ నుంచి మ్యాచ్‌కు ప్రతి ఆటగాడికి రూ. 7.5 లక్షలు అందజే యాలని కౌన్సిల్ తీర్మానించింది.

ఈ నిబంధన ప్రకారం అన్ని సీజన్‌లో అన్ని మ్యాచులు ఆడిన ఆటగాడికి రూ. 1.05 కోట్ల ఆదాయం లభించనుంది. ప్రాంచైజీలకు కేటాయించిన పర్స్ మనీకి ఇది అదనం. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కూడా కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది.