calender_icon.png 17 October, 2024 | 3:56 AM

ఐరిస్‌తో అక్రమాలకు చెక్

17-10-2024 01:59:08 AM

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సరికొత్త విధానం

మెదక్ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం

జిల్లావ్యాప్తంగా 483 కేంద్రాల ఏర్పాటు

ప్రతి కేంద్రంలో వేర్వేరుగా సన్న, దొడ్డు రకం కౌంటర్లు

రెండు రోజుల్లో కేంద్రాలు ప్రారంభం

మెదక్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ఐరిస్ విధానాన్ని అమలు చేయనున్నది. ఈ సీజన్ నుంచే ప్రక్రియ అమలు కానున్నది. ఆ పరికరాలు ఇప్పటికే జిల్లాకేంద్రంలోని డీసీఎస్వో కార్యాలయానికి వచ్చాయి.

ఇక నుంచి ధాన్యాన్ని విక్రయించే రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంటుంది. నిర్వాహకులు సదరు రైతు ఐరిస్ తీసుకున్న తర్వాతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

ఏ కారణం చేతనైనా రైతు కేంద్రానికి రాకపోతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతుంది. సర్కార్ ప్రతి కేంద్రంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నది. సన్న ధాన్యం ఒక క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్న నేపథ్యంలో సన్న, దొడ్డు రకం ధాన్యం నిర్ధారణ బాధ్యతలను ఏఈవోలు  చూసుకోనున్నారు. 

కోటి గన్నీ బ్యాగులు అవసరం..

ఈ సీజన్‌లో ధాన్యం సేకరణకు కోటి గన్నీ బ్యాగులు అవసరమని ఇప్పటికే పౌర సరఫరాలశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆ శాఖ పరిధిలో 46 లక్షల బ్యాగులు అందుబాటులో ఉండగా, మరో 18 లక్షల సంచులు మిల్లుల్లో ఉన్నా యి. ఇవి కాక అధికారులు మరో 36 లక్షల సంచులు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

అలాగే కొనుగోలు ప్రక్రియకు 12 వేల టార్ఫాలిన్లు, 450 ప్యాడీ క్లీనర్లు, 450 డ్రయ్యర్లు, 650 తేమ  యంత్రాలు అవసరం అవుతాయని అధికారులు గుర్తిం చారు. ఈసారి కేవలం 47 రైస్‌మిల్లులకు మాత్రమే ధాన్యం పంపిస్తామని ఇప్పటికే కలెక్టర్ ప్రకటించారు. గత సీజన్‌లో సీఎంఆర్ క్లియర్ చేసిన యాజమాన్యాలకు మాత్ర మే ధాన్యం కేటాయిస్తారా ? లేదా మరేదైనా పద్ధతి అవలంబిస్తారా..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 

483 కేంద్రాలు ఏర్పాటు..

వానకాలం సీజన్‌లో రైతులు జిల్లావ్యాప్తంగా 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనిలో సన్న రకం 1,04,970 ఎకరాలు, దొడ్డు రకం 1,92,365 ఎకరాల్లో సాగు అయింది. కాగా సన్నరకం 2,30,964 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 5,19,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈసారి సన్నరకం ఎక్కువ మంది రైతులు సాగు చేశారు. వచ్చే దిగుబడి అంచనాలను బట్టి జిల్లాలో 483 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిలో సన్న రకం కేంద్రాలు 93 కాగా, దొడ్డు రకం కేంద్రాలు 390. నవంబర్ మొదటి వారం నుంచి వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఏఈవోలదే కీలక పాత్ర..

ధాన్యం తేమశాతం పరిశీలన, టోకెన్లు, సన్నరకం ధాన్యం నిర్ధారణలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏఈవో) కీలకపాత్ర పోషించనున్నారు. రైతుల ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించి టోకెన్లు ఇస్తే రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ చెల్లించనుండగా ఏఈవోలు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఏఈవోలకు హెచ్చరికలు జారీ చేసింది. 

రెండు రోజుల్లో కేంద్రాలు ప్రారంభిస్తాం

జిల్లాలో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ధాన్యం కొనుగోళ్లలో  అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈసారి ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నది. సిబ్బంది రైతుల ఐరిస్ తీసిన తర్వాతే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తారు.

 హరికృష్ణ, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మెదక్