calender_icon.png 5 February, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుకేశ్‌కు చెక్..

04-02-2025 01:45:11 AM

టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీ ప్రజ్ఞానంద సొంతం

  • ఆనంద్ తర్వాత రెండో భారతీయుడిగా ప్రజ్ఞ రికార్డు
  • ట్రై బ్రేకర్‌లో పరాజయం పాలైన గుకేశ్ 

విజయక్రాంతి ఖేల్ విభాగం: టాటా స్టీల్ చెస్ చాంపియన్‌షిప్‌ను భారత్‌కు చెందిన ప్రజ్ఞానంద దక్కించుకున్నాడు. చదరంగంలో విశ్వవిజేతగా ఉన్న గుకేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజ్కాంజి నగరంలో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో గుకేశ్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించి టోర్నీని కైవసం చేసుకున్నాడు.

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీని గెల్చుకున్న రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద రికార్డులకెక్కాడు. ఆనంద్ 2006లో టాటా మాస్టర్స్ చెస్ టోర్నీని గెలుచుకోగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయులెవరూ ఈ ట్రోఫీని ఒడిసిపట్టుకోలేదు. కానీ ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రజ్ఞానంద విజయం సాధించడం గమనార్హం. 

టై బ్రేకర్‌లో తేలిన ఫలితం

13 రౌండ్లు ఉండే టాటా స్టీల్ చెస్ టోర్నీ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. అందరు క్రీడాకారులు నువ్వా అన్నట్లు తలపడ్డారు. 12 రౌండ్లు ముగిసే సరికి ప్రజ్ఞానంద, గుకేశ్ చెరి 8.5 పాయింట్లతో నిలిచారు. దీంతో 13వ రౌండ్ ఉత్కంఠగా సాగింది. కానీ 13వ రౌండ్ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు కూడా ఓటమి చవిచూశారు.

తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైశి చేతిలో గుకేశ్, ప్రజ్ఞానంద విన్సెంట్ చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో ఇద్దరు ప్లేయర్లు చెరి 8.5 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరిలో ఒకరిని విజేతగా నిర్ణయించేందుకు టై బ్రేక్ తప్పనిసరయింది.

టై బ్రేక్‌లో గుకేశ్ మీద ప్రజ్ఞానంద విజయం సాధించడంతో ట్రోఫీ ప్రజ్ఞానంద వశం అయింది. ప్రజ్ఞానంద మీద టై బ్రేక్‌లో ఓడిపోయిన తర్వాత గుకేశ్ చాలా ఫీల్ అయ్యాడు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైశి అంచనాలను అందుకోవడం విఫలం అయ్యాడు.