calender_icon.png 27 December, 2024 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్‌కమ్ లెటర్స్‌తో నకిలీలకు చెక్!

07-11-2024 12:27:37 AM

  1. ఫేక్ రిజిస్ట్రేషన్ల నివారణపై వాణిజ్య పన్నుల శాఖ ఫోకస్
  2. వినియోగదారులకు ఉత్తరాలు పంపాలని నిర్ణయం
  3. వెనక్కి వచ్చిన లెటర్స్ ఆధారంగా విచారణ
  4. తమిళనాడులో సత్ఫలితాలిస్తున్న ప్రయత్నం
  5. రాష్ట్రంలోనూ అమలుకు సర్కారు సన్నద్ధం 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): లీకేజీలను అరికట్టి ఆదాయాన్ని పెంచుకోవడంపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించింది.

తొలుత నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టడంపై ఫోకస్ పెట్టింది. తమిళనాడులో అనుసరిస్తున్న పద్ధతిని రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తోంది. కమర్షియల్ ట్యాక్స్ వినియోగదారులకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వెల్‌కమ్ లెటర్స్ పంపేందుకు సమాయాత్తమవుతోంది.

ఈ ప్రయత్నం తమిళనాడులో మంచి ఫలితాలను ఇస్తున్న నేపథ్యంలో అదే విధానాన్ని ఇక్కడా అమలు చేసేందుకు కమర్షియల్ ట్యాక్స్ విభాగం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వెల్‌కమ్ లెటర్ పంపిస్తే ఏమవుతుంది?

రాష్ట్రంలో ప్రస్తుతం 2,23,832 మంది జీఎస్టీ వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి జీఎస్టీ కస్టమర్‌కు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక వెల్‌కమ్ లెటర్‌ను పంపిస్తారు. అందులో సదరు వినియోదారుడు జీఎస్టీ ఖాతాదారు అయినం దుకు అభినందనలు తెలుపుతూ.. అతను ఇప్పటివరకు ఎంత జీఎస్టీ కట్టాడు? ఇంకా చెల్లించాల్సి ఉందో ఆ మొత్తాన్ని ఫలానా తేదీలోపు కట్టాలని..

ఇలా పలు వివరాలను ఆ లెటర్‌లో వాణిజ్య పన్నుల శాఖ పొందుపరుస్తుంది. దీన్ని చూసిన ఆ వినియోదా రుడు నిర్ణీత గడవులోగా చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం ప్రస్తుతం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో లేదు.

అయితే కొందరు ఫేక్ అడ్రస్ వివరాలను సమర్పించి, నకిలీ రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకుంటారు. వారు సమర్పించిన అడ్రస్‌కు వెల్‌కమ్ లెటర్స్ పంపిస్తే, అవి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వెనక్కి వచ్చిన లెటర్స్ ఆధారంగా నకిలీ రిజిస్ట్రేషన్లను సులభంగా అరికట్టొచ్చని అధికారులు ఆలోచిస్తున్నారు.

ఒప్పందానికి రెడీ? 

2024-25 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన రాబడి రావడం లేదు. రెండో త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల్లో కేవలం 42 శాతం వసూళ్లు మాత్ర మే వచ్చాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రిజ్వీ అధికారులను ఆదేశించారు.

కమిషనర్ ఆదేశాల మేరకు జీఎస్టీ వసూళ్లలో అత్యుత్తమ వృద్ధి రేటును నమోదు చేస్తున్న తమిళనాడులో ఇటీవల రాష్ట్ర బృందం పర్యటించి, అక్కడ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా ఫేక్ రిజిస్ట్రేషన్లను నివారించేందుకు అక్కడి కమర్షియల్ ట్యాక్స్ విభాగం పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వెల్‌కమ్ లెటర్స్ పంపడం గురించి తెలంగాణ అధికారులు తెలుసుకున్నారు.

అది అక్కడ మంచి ఫలితాలను ఇస్తున్న క్రమంలో రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు వాణిజ్య పన్నుల శాఖతో పాటు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ ఒక ఒప్పందం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.