- ఇకనుంచి ఆన్‌లైన్ చెల్లింపులు
- క్యూఆర్ కోడ్ ద్వారా నగదు రహితం
- జూలై 1 నుంచే ప్రారంభమైన సేవలు
మెదక్, జూలై 15(విజయక్రాంతి): వినియోగదారులకు సులభంగా, వేగంగా సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సేవలన్నీ ప్రస్తుతం మీసేవ కేంద్రాల్లోనే కొనసాగుతుండగా.. రెవెన్యూ శాఖకు సంబంధించిన సేవలు ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే మీసేవ కేంద్రాల్లో ఆయా సేవలకు తీసుకోవాల్సిన రుసుమును ప్రభుత్వం నిర్దేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన రుసుము వివరాలు వినియోగదారులకు కనిపించేలా కేంద్రాల్లో బోర్డులు ప్రదర్శించాలి. కొందరు నిర్వాహకులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లాలో ప్రభుత్వ, పల్లె సమగ్ర సేవా కేంద్రాలు(వన్ స్టాప్ సర్వీసెస్) కలిపి మొత్తంగా 73 కేంద్రాలు ఉన్నాయి.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి..
మీసేవ కేంద్రాల్లో రెవెన్యూ పరమైన సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచి ఈ నూతన విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. అంతకుముందే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నది. ఇది సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రైవేట్ కేంద్రాల్లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా రుసుము వసూలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు స్కానర్లు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. మీసేవ కేంద్రం నిర్వాహకులే వారి సెల్‌ఫోన్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే గ్రామీణులకు మొదట ఆన్‌లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
అదనపు వసూళ్లకు చెక్..
మీసేవ కేంద్రాల్లో ఏ సర్టిఫికెట్‌కైనా రూ. 100 తీసుకోవాల్సి ఉంటే కొందరు నిర్వాహకులు రూ.120 నుంచి రూ.150 వరకు వసూ లు చేస్తున్నారు. ఇకమీదట మీసేవ కేంద్రాల్లో రెవెన్యూకు సంబంధించి ఏ సర్టిఫికెట్‌కైనా క్యూఆర్ కోడ్ ద్వారానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నిర్వాహకులు స్కాన్ చేయగానే ఎన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో అంతే డెబిట్ అవుతుంది. దీంతో అదనపు వసూళ్లకు బ్రేక్ పడింది. మున్ముందు అన్ని సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కేంద్రాల్లో ఎల్ డివైజ్‌లు
ఏ ప్రభుత్వ పథకానికైనా ఈకేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్ డివైజ్‌ల ద్వారా వేలిముద్రలు తీసుకుంటారు. నూతనంగా మీసేవ కేంద్రాలకు కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేసింది. మీసేవ కేంద్రాల్లో ప్రస్తుతమున్న బయోమెట్రిక్ డివైజ్‌ల స్థానంలో ఎల్ మోడల్ పరికరాలు తీసేసి ఎల్‌శ పరికరాలు ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి
మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా రుసుము చెల్లింపు విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానాన్ని మీసేవ కేంద్రాల్లో పకడ్బందీగా అమలు చేస్తాం. వినియోగదారులు పొందిన సేవలకు క్యూఆర్ కోడ్ ద్వారానే రుసుము చెల్లించాలి. అలాగే మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ ఎల్ పరికరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు ప్రభుత్వం సెప్టెంబరు వరకు గడువు ఇచ్చింది.
సందీప్, మీసేవ ఈడీఎం, మెదక్