2025 ఏప్రిల్ నుంచి ప్రతినెలా సర్వీస్ క్వాలిటీపై సమీక్ష
27వేల టవర్ల ఏర్పాటు ప్రణాళికలు
న్యూఢిల్లీ, నవంబర్ 13: కాల్ డ్రాప్‌కు సంబంధించిన సమస్యలపై వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండటంతో కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు బుధవారం వెల్లడించింది. సర్వీస్ క్వాలిటీపై ఇప్పటి వరకు మూడు నెలలకు ఓసారి సమీక్ష జరుపుతుండగా 2025 ఏప్రిల్ నుంచి ప్రతినెలా సమీక్షించనున్నట్టు వెల్లడించింది.
ఇకపై కాల్ క్వాలిటీ టెస్ట్‌ను టవర్ల వద్ద కాకుండా స్మార్ట్‌ఫోన్ స్థాయిలోనే జరపనున్నట్టు స్పష్టం చేసింది. మైక్రో లెవెల్ విధానం ద్వారా కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం వివరించింది. అంతేకాకుండా కనెక్టివిటీని పెంపొందించి దేశ వ్యాప్తంగా కొత్తగా 26వేల గ్రామాలకు సేవలందేలా సుమారు 27వేల టవర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న మోసాలను అడ్డుకునేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది.