calender_icon.png 27 October, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయు కాలుష్యానికి చెక్!

27-10-2024 12:00:00 AM

  1. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు
  2. పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఎయిర్ క్వాలిటీపై దృష్టి
  3. రోడ్డు డస్ట్ కూడా కాలుష్య కారకంగా గుర్తింపు
  4. పారిశ్రామిక, మైనింగ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
  5. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసే విధానాలపై అధ్యయనం
  6. పీసీబీ, హెచ్‌ఎండీఏ, రవాణా, ట్రాఫిక్ అధికారులతో మంత్రి కొండా సురేఖ చర్చలు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మానవ జీవన ప్రమాణాలను, జీవ వైవిధ్యాన్ని కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. పలు రకాల కాలుష్య కారకాల వల్ల రోజురోజుకు వాయుకాలుష్యం పెచ్చురిల్లుతోంది. దేశంలో వాయు కా లుష్య తీవ్రత ఆందోళనకరంగా ఉందని లాన్సెట్ నివేదిక ఇటీవల వెల్లడించింది.

హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా వాయుకాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని తెలిపింది. 2008 నుంచి 2019 మధ్య పదకొండేళ్లలో సంభవించిన దా దాపు 36 లక్షల మరణాలను అధ్యయనం చే సింది.

రోజువారి మరణాలు, వాయు కాలుష్యం మధ్య ఉన్న సంబంధాలపై హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసిల్లో అధ్యయ నం చేసినట్టు లాన్సెట్ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. వాయుకాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

ఆ దిశ గా చర్యలు తీసుకోవడంపై చర్చించేందుకు ఇటీవల సచివాలయంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), హెచ్‌ఎండీఏ, రవాణా, ట్రాఫిక్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా రు. వాయు కాలుష్య నియంత్రణ కోసం రూ పొందించాల్సిన కార్యాచరణ, ప్రణాళికపై ప్రధానంగా  చర్చించినట్లు తెలుస్తోంది. 

వాయు కాలుష్యంతోనే 1,597 మరణాలు

దేశంలోని పది నగరాల్లో గాలిలో కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించిందని నివేదిక వెల్లడిం చింది. పీఎం 2.5 స్థాయులు ప్రతి ఘనపు మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణా లు 1.42 శాతం అధికమైనట్టు అధ్యయనం గుర్తించింది. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని వెల్లడించింది.

అయితే వేర్వేరుగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని నివేదిక స్పష్టం చేసింది. పీఎం 2.5 రేణువులు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాలు ఢిల్లీలో 0.31శాతం, బెంగుళూరులో 3.06 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది. అయితే హైదరాబాద్‌లో మొత్తం మరణాల్లో 5.6 శాతం కాలు ష్యం వల్ల సంభవించినవేనని అధ్యయనం తెలిపింది. ఏడాదిలో వాయు కాలుష్యం వల్ల 1,597 మరణాలు సంభవించాయని లాన్సెట్ తన నివేదికలో వెల్లడించింది. 

ఎయిర్ క్వాలిటీ పెంచాలి

వాయు కాలుష్యంతో సంభవించే మరణాలు పెరుగుతుండటంతో ఆ దిశగా ప్రభుత్వం, పర్యావరణ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పట్టణాలు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో గాలి నాణ్యతపై మంత్రి కొండా సురేఖ అధికారులను ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎయిర్ క్వాలిటీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.

అయితే గాలి నాణ్యత తగ్గిపోవడానికి వాహన ఉద్గారాలతోపాటు, రోడ్డు డస్ట్ కూడా ప్రధాన కారణంగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వాయు కాలుష్యానికి కారకంగా మారుతున్న రోడ్డు డస్ట్‌కు కారణాలను గుర్తించి, దీని నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. 

పారిశ్రామిక, మైనింగ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ప్రధానంగా పట్టణాల పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామిక ప్రాంతాలు, మైనింగ్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లోనే రోడ్డు డస్ట్ ఎక్కువగా కాలుష్యానికి కారణమవుతుందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్ట పక్క ల ఉన్న పటాన్‌చెరు ప్రాంతం, నల్లగొండ జిల్లా వైపు, తాండూర్ ప్రాంతంలో రోడ్డు డస్ట్ తీవ్రత ఎక్కువగా గుర్తించినట్టు తెలుస్తోంది.

అయితే పఠాన్‌చెరు, నల్లగొండ జిల్లా వైపు పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, తాండూరు ప్రాంతంలో మైనింగ్ ఎక్కువగా జరుగుతుండటం రోడ్డు డస్ట్‌కు కారణమని అధికారులు మంత్రికి వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, మైనింగ్ జరిగే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాయు కాలుష్యాన్ని నివారించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. 

ఇతర రాష్ట్రాల్లోని విధానాలపై అధ్యయనం..

వాయు కాలుష్య నివారణ, పట్టణాలు, మున్సిపాలిటీల్లో గాలి నాణ్యత పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాల్లో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరుతెన్నెలను అధ్యయనం చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అధ్యయనం అనంతరం పట్టణాలు, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి, కాలుష్యాన్ని నియంత్రించాలని మంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది.