calender_icon.png 23 October, 2024 | 8:48 AM

జీఎస్టీ అధికారుల మోసం

05-05-2024 12:13:44 AM

లేని కంపెనీని ఉన్నట్లు సృష్టించి..

వ్యాపారులతో కలిసి రూ. 45 కోట్ల టోకరా

ఐదుగురు నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4(విజయక్రాంతి): అవినీతి ఉచ్చు లో కూరుకుపోయిన కొందరు జీఎస్టీ అధికారులు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. లేని కంపెనీలను ఉన్నట్లు సృష్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ప్రతి వస్తువు కొనుగోలుపై ప్రభుత్వానికి జీఎస్టీ పన్నులు చెల్లిస్తున్న ప్రజల కష్టార్జితాన్ని కొందరు అవినీతి అధికారులు తమ ఖాతా ల్లో జమ చేసుకుంటున్నారు. తాజా గా కొందరు జీఎస్టీ అధికారులు వ్యాపారులతో కలిసి  భారీ మోసానికి పాల్పడ్డారు.

ఈ కేసుతో ప్రమేయమున్న ఐదుగురు జీఎస్టీ అధికారులను శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన చిరాగ్ శర్మ(టాక్స్ కన్సల్టెంట్), ఆంధ్రప్రదేశ్ పల్నాడు, కడప ప్రాంతాలకు చెందిన వీఆర్ రమేష్ రెడ్డి, ఎం గిరిధర్ రెడ్డి, కే వినీల్ చౌదరీలు ఎలక్ట్రికల్ బైక్‌ల తయారీ యూనిట్‌లు ప్రారంభిస్తున్నామని హైదరాబాద్‌లో పలు వురు అమాయకులను నమ్మించారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి ఎలక్ట్రిసిటీ బిల్లులను సేకరించారు. అనంతరం నకిలీ పత్రాలు, రెంటల్ అగ్రిమెంట్‌లు సృష్టించి జీఎస్టీ పోర్టల్‌లో నమోదు చేశారు. లేని కంపెనీలు ఉన్నట్లు చూపించి జీఎస్టీ రీఫండ్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ కుంభకోణంలో వ్యాపారులకు సహకరించిన జీఎస్టీ అధికారులు.. పీటల స్వర్ణకుమార్ (డిప్యూటీ కమిషనర్ నల్లగొండ, జీఎస్టీ డివిజన్), కేలం వేణుగోపాల్ (అసిస్టెంట్ కమిషనర్, స్టేట్ టాక్స్, అబిడ్స్ సర్కిల్), పొదిలా విశ్వకిరణ్ (అసిస్టెంట్ కమిషనర్, స్టేట్ టాక్స్, మాదాపూర్ సర్కిల్ మర్రి మహిత (సీనియర్ అసిస్టెంట్, మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ జీఎస్టీ కమిషనర్ వెంకటరమణ (డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్, జీఎస్టీ, మాదాపూర్ సర్కిల్)లను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.45 కోట్లను వ్యాపారులతో కలిసి జీఎస్టీ అధికారులు కాజేసినట్లు సమాచారం. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం నిందుతులను రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో గతంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.