calender_icon.png 22 January, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చౌక గృహాలు, మౌలిక వృద్ధికి ప్రాధాన్యం

22-07-2024 12:05:00 AM

కేంద్ర బడ్జెట్‌పై అసోచామ్ అంచనాలు

న్యూఢిల్లీ, జూలై 21: వచ్చే కేంద్ర బడ్జెట్‌లో చౌక గృహ రంగం, మౌలిక రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తారని వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య అసోచామ్, కన్సల్టింగ్ సంస్థ ప్రైమస్‌లు  తాజాగా విడుదల చేసిన పత్రంలో అంచనా వేశాయి. వీటికి తోడు  గ్రీన్ మొబిలిటీ, తయారీ రంగం వృద్ధి, వినియోగ డిమాండ్ పెంపునకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తారని అసోచామ్ రిపోర్ట్ పేర్కొంది. జూలై 23 మంగళవారంనాడు ఆర్థిక మంత్రి సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు.

2047 సంవత్సరానికల్లా భౠరత్‌ను ధనికదేశంగా రూపొందించడానికి అవసరమైన దీర్ఘకాలిక బ్లూప్రింట్‌ను కూడా మోదీ 3.0 తొలి బడ్జెట్లో పొందుపరుస్తారని, ఈ లక్ష్య సాధనకు అవసరమైన ప్రాధాన్యతలపై బడ్జెట్లో దృష్టిపెడతారని అసోచామ్ పత్రం వివరించింది. ఆర్థిక వ్యవస్థకు తక్షణావసరాలైన వినియోగం, పెట్టుబడుల పెంపు, సరఫరా వ్యవస్థల మెరుగుదల కోసం ప్రతిపాదనలు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ చెప్పారు. తదుపరి అభివృద్ధిచెందిన దేశాలస్థాయికి జాతీయ ఆదాయాన్ని పెంచాలన్న భారీ లక్ష్యంపై రోడ్‌మ్యాప్‌ను కేంద్ర బడ్జెట్లో పొందుపరుస్తారని భావిస్తున్నామన్నారు. మూలధన పెట్టుబడుల కోసం వ్యయపర్చడానికి తగిన ఆర్థిక వెసులుబాటు ప్రభుత్వానికి ఉందని, అయితే వ్యూహాత్మకంగా ఆస్తుల్ని నగదీకరించడం ద్వారా క్యాపెక్స్‌ను పెంచవచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ సూచించారు. 

పీఎంఏవై 2.0

ఈ బడ్జెట్లో చౌక గృహ నిర్మాణాలను పెంచేదిశగా ప్రధాన మంత్రి అవాస్ యోజన 2.0ను (పీఎంఏవై 2.0) ప్రతిపాదిస్తారని అసోచామ్ ప్రైమస్ పత్రం అంచనా వేసింది. జనాభాలో అధిక వర్గాలకు సొంత గృహాలను కల్పించేదిశగా తగిన ఆర్థిక వనరులు, ఇతర ప్రయోజనాల కోసం పీఎంఏవై 2.0లో ఇందులో అఫర్డ్‌బుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్ (ఏహెచ్‌పీ), బెనిఫీషియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ (బీఎల్‌సీ) తదితర సొల్యూషన్లను చేరుస్తారని అంచనాల్లో పేర్కొంది.

మధ్యతరగతి నుంచి వినియోగ డిమాండ్ పెంచడంపై బడ్జెట్లో దృష్టిపెడతారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నట్టు అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ చెప్పారు. వ్యాపార సరళీకరణ, పెట్టుబడుల పెంపు కోసం స్నేహపూరిత విధానాల్ని ప్రతిపాదిస్తారని భావిస్తున్నామని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు తయారీ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నదని ప్రైమస్ పార్టనర్స్ సీఈవో నిలయా వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈలను పటిష్టపర్చడానికి క్లస్టర్స్‌కు మద్దతు ఇవ్వడం, ఈవీ, ఎలక్ట్రానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీకి కొత్త క్టస్లర్స్ ఏర్పాటు చేయడం కీలకమని చెప్పారు. 

వ్యవసాయానికి ఊతం

వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతులపై బడ్జెట్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అసోచామ్ ప్రైమస్ పత్రం అభిప్రాయపడింది. పంట దిగుబడి తర్వాతి నష్టాల్ని తగ్గించడం, రైతులకు మెరుగైన ధర లభించేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ సదుపాయాలు వంటి మౌలిక వసతుల్ని పెంపొం దించాలని సూచించింది. 

నేడు ఆర్థిక సర్వే వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 21: ప్రతీ ఏడాది సాధరణ బడ్జెట్‌కు ముందురోజున విడుదల అయ్యే ఆర్థిక సర్వేను జూలై 22 సోమవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పిస్తారు. సోమవారంనాటి పార్లమెంటు సమావేశంలో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా సమర్పణ ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కిరణ్ రిజ్జు తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆర్థిక మం త్రి 23న ప్రవేశపెడతారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ సర్వేను రూపొందిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్ని, వివిధ రంగాల సూచికలను, ప్రస్తు త ఆర్థిక సంవత్సరానికి కొన్ని అంచనాలను ఈ బడ్జెట్ ముందస్తు డాక్యు మెంటులో పొందుపరుస్తారు. 2024 25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ఏ విధం గా ఉండబోతుందన్న సంకేతాలు సైతం ఆర్థిక సర్వేలో వెల్లడవుతాయి. సర్వేలో వివిధ రంగాలవారీగా చాప్టర్లు, దృష్టిసారించాల్సిన అంశాలపై కొత్త చాప్టర్లు ఉంటాయి. 

చర్రిత సృష్టించనున్న సీతారామన్

వచ్చే మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. 2024 సంవత్సరానికి వరుసగా ఏడవ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఘనత సాధిస్తారు. మాజీ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లను, ఒక మధ్యంతర బడ్జెట్‌ను మొత్తం ఆరు బడ్జెట్లను ప్రతిపాదించి సృష్టించిన రికార్డును సీతారామన్ ఈ జూలై 23న అధిగమిస్తారు. వచ్చే నెలలో 65 ఏటలో ప్రవేశిస్తున్న నిర్మలా సీతారామన్ 2019లో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.

అప్పటినుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన ఒక మధ్యంతర బడ్జెట్‌తో సహా వరుసగా ఆరు బడ్జెట్లను లోక్‌సభకు సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ఆమెకు ఏడవది. మురార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన 1959 మధ్యకాలంలో ఐదు పూర్తి బడ్జెట్లను, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. గత నెలలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తొలి బడ్జెట్ ఈ జూలై 23న సీతారామన్ ప్రవేశపెడతారు.