calender_icon.png 24 March, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినరా భారత...

23-03-2025 12:59:38 AM

‘వినరా భారత వీర కుమారా..’ అంటూ అల్లంత దూరం నుంచి వినిపిస్తున్న బుర్రకథాగానాన్ని ఎవరైనా చెవులు రిక్కించి వింటున్నారంటే, అది భారతీయ గాథలపై ఉత్సకత కలిగి ఉన్న కళాహృదయమే అయ్యుంటుంది. ఔను, భారతీయ కథల గొప్పతనం అలాంటిది మరి. పురాణాలు, ఇతీహాసాలు, చారిత్రక సంఘటనలను కావ్యం, కథాగానం, దృశ్యరూపం.. ఏ రకంగా చెప్పినా కడు ఆసక్తికరమే. ఇక ఆ కథలకు సినిమా హంగులద్దితే హిట్ పడాల్సిందే! భారతీయ ఛాయలున్న కథను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన ఏ చిత్రమైనా బొమ్మ బ్లాక్‌బస్టరే! అలా భారతీయ గ్రంథాల్లోని సుగంధ పరిమళాలను ఇటీవలే కొన్ని సినిమాలు పంచాయి. మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉండగా, ఇంకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 

మరాఠా యోధుడి జీవిత విశేషాలతో ‘ఛావా’ 

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది ‘ఛావా’. ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. మొత్తంగా ఛావా ఓ పేరు కాదు.. ఓ ఎమోషన్ అని చెప్పాలి. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించారు. రష్మిక మందన్న ఆయన భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించారు. చారిత్రక చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందీ సినిమా. క్రిటిక్స్ ప్రశంసలతోపాటు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవు తూ ఎన్నో రికార్డులను సృష్టిస్తోంది. 

‘ఛత్రపతి శివాజీ’గా రిషబ్ శెట్టి 

‘ఛావా’ సినిమా ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంపై నెలకొంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఛత్రపతి శివాజీ జీవిత విశేషాలతో రూపుదిద్దుకుంటోందీ సినిమా. దీనికి ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే టైటిల్ ఖరారైంది. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో సందీప్‌సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027, జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఒకే సారి ఏడు భాషల్లో.. అంటే తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ, మలయాళం, బెంగాలిల్లో విడుదల కానుంది. 

నాస్తికుడు శివ భక్తుడిగా మారిన తీరే ‘కన్నప్ప’ కథ 

మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మంచు మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాస్తికుడిగా ఉన్న కన్నప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు అనే కథతో ఈ సినిమా రాబోతోంది. హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. పరమభక్తితో శివున్ని ప్రసన్నం చేసుకున్న భక్త కన్నప్ప కథను తెరపై ఆవిష్కరించడం కొత్తేమీ కాదు. కానీ మంచు విష్ణు అదే భక్తకన్నప్పను తనదైన శైలిలో చూపించే ప్రయత్నంలో రూపొందిద్దుకున్నదే ‘కన్నప్ప’. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం. 

బాలీవుడ్‌లో ‘రామాయణ’ 

యుగాలు గడిచినా, తరాలు మారినా మర్యాదాపురుషోత్తముడి కథ నిత్యనూతనం. 5 వేల సంవత్సరాలపైగా కోట్లాది హృదయాలను పాలిస్తున్న భారతీయ ఇతీహాస గ్రంథం రామాయణం. దీని ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే రాముడి కథ మరోమారు బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. ‘రామాయణ’ పేరుతో నితేశ్ తివారీ దర్శకత్వంలో రెడు భాగాల్లో రూపుదిద్దుకుంటోందీ సినిమా. 2026 దీపావళి కానుకగా మొదటి భాగాన్ని, 2027 దీపావళికి రెండోభాగాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీదేవోల్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు. 

‘జలియన్‌వాలాబాగ్’ ఉదంతంపై ఓటీటీలో.. 

భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని దారుణ ఉదంతం.. జలియన్ వాలాబాగ్ ఊచకోత. బ్రిటిష్ పాలనా కాలంలో 1919, ఏప్రిల్ 13న ఈ మారణహోమం జరిగింది. ఈ  ఘటన ఆధారంగా ఓటీటీ వేదికగా ఓ వెబ్‌సిరీస్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. మార్చి 7 నుంచి సోనీలివ్‌లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌లో తారుక్ రైనా, నిఖితా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇంకా ఎన్నో.. 

ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నాగ్‌అశ్విన్ ‘కల్కి2898ఏడీ’ని తెరకెక్కించారు. ఈ సినిమా మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకొని రూపొందిన విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’తోపాటు ‘కశ్మీర్ ఫైల్స్’, ‘ఆర్టికల్ 370’ తదితర సినిమాలు కూడా భారతీయ చరిత్ర, సంఘటనల ఆధారంగా వచ్చినవే. 

చారిత్రక యోధుడు ‘వీరమల్లు’  

పవన్‌కల్యాణ్ తొలిసారిగా ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. అదే ‘హరిహర వీరమల్లు: పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతికృష్ణ ఈ యాక్షన్ ఎపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందుతోంది. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్‌కల్యాణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో కనిపించనున్నారు. కీరవాణి సం గీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘మాట వినాలి’ అనే పాట కోసం పవన్‌కల్యాణ్ మరోసారి తన గొంతును సవరించుకున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మే 9న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. 

- నరేశ్ ఆరుట్ల