calender_icon.png 24 October, 2024 | 7:48 PM

హైదరాబాద్‌కు చార్లెస్ స్కాబ్

09-08-2024 02:00:20 AM

  1. కొత్తగా టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ 
  2. డల్లాస్‌లో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు

యాపిల్ పార్కును సందర్శించనున్న సీఎం 

పెట్టుబడుల ప్రకటనలన్నీ వాస్తవాలే: జయేశ్ రంజన్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయ క్రాంతి): ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పేరొందిన చార్లెస్ స్కాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హెవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈ సంద ర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసర మైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు చార్లెస్ స్కాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్శించనుంది. 

ఆపిల్ ప్రధాన కార్యాలయానికి సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్క్‌ను సందర్శించనున్నారు. ఆపిల్ మాన్యుఫ్యాక్చర్ టీమ్‌తో సీఎం, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ట్రినేట్ కంపెనీ సీఈవోతో చర్చించనున్నారు. ఆరమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై హైదరాబాద్‌లో ఆ కంపెనీ డాటా సెంటర్స్ విస్తరణ కోసం చర్చలు జరుపనున్నారు. పలువురు టెక్ కంపెనీల ప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. అంగెన్ సంస్థ్థ సీనియర్ లీడర్‌షిప్‌తో పెట్టుబడులపై చర్చించనున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ రెనేశాస్, మాన్యుఫ్యాక్చర్ సంస్థ అమాట్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. బుధవారం ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.  

పెట్టుబడులన్నీ వాస్తవమే: జయేష్ రంజన్

సీఎం అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ వాస్తవమేనని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజ న్ స్పష్టంచేశారు. పెట్టుబడులు బోగస్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఈ మేరకు ఓ వీడియో విడు దల చేశారు. సీఎం రేవంత్ పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలను కలుస్తున్నారని, తెలంగాణకు పెట్టుబడులను ఆకర్శిస్తున్నారని తెలిపారు. సమావేశాల విశ్వసనీయతపై తెలంగాణ ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.