calender_icon.png 27 October, 2024 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత కొండంత.. వసతులు గోరంత

09-07-2024 01:08:53 AM

కూలేందుకు సిద్ధంగా ఉన్న ఓయూ విద్యార్థుల హాస్టళ్లు

పాములు తేళ్లతో భవిష్యత్ తరం సహవాసం

చదువు చెప్పేందుకు అధ్యాపకులు కరువు

తాత్కాలిక అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్న వర్సిటీ 

పేరుకే ల్యాబులు.. లోపల పరికరాలు అంతంతే

పోరాటాల పురిటిగడ్డ.. 

మేధో చర్చలకు రచ్చబండ.. నాయకులు, ఇంజినీర్లు, డాక్టర్లను తయారుచేసిన గొప్ప మేధో కార్ఖానా.. ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణకే కాదు.. మొత్తం తెలుగు నేలలోనే ఉన్నత విద్య అంటే టక్కున గుర్తొచ్చేది ఓయూనే. ఎన్నో దేశాలనుంచి కూడా విద్యార్థులు ఓయూను వెతుక్కొంటూ వస్తుంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఓయూ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కి కొట్టుమిట్టాడుతున్నది. ౧౦౭ ఏండ్ల చరిత్రగల యూనివర్సిటీ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మారింది. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఓయూపై విజయక్రాంతి ప్రత్యేక కథనం..  

హాస్టళ్లను సందర్శించిన జేఎన్టీయూహెచ్ అధికారులు

విజయక్రాంతి కథనానికి స్పందన

  1. సమస్యలకు చిరునామాగా ఓయూ
  2. చరిత్ర మాత్రమే ఘనం.. వర్తమానం శూన్యం
  3. కూలేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థుల హాస్టళ్లు
  4. పాములు తేళ్లతో భవిష్యత్ తరం సహవాసం
  5. చదువు చెప్పేందుకు అధ్యాపకులు కరువు
  6. తాత్కాలిక అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్న వర్సిటీ
  7. పేరుకే ల్యాబులు.. లోపల పరికరాలు కరువు

చిలువేరు శ్రీకాంత్ :

  హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 107 ఏండ్ల చరిత్ర కలిగిన ఓయూ క్యాంపస్ చరిత ఘనం.. అభివృద్ధి శూన్యం అన్నట్టుగా ఉంది. ఎన్నో కలలతో ఓయూకు వచ్చే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వర్సిటీలోని హాస్టళ్ల పరిసరాలు డంప్ యార్డులను తలపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పాములతో సహవాసం చేస్తున్నట్లు ఉంటుందని పలువురు విద్యార్థులు వాపోయారు.

సంవత్సరం క్రితం ఓ విద్యార్థికి, ఆరు నెలల క్రితం మరో విద్యార్థికి పాము కాటు వేసిందని తెలిపారు. దీంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చదువులు సాగిస్తున్నారు. మరోవైపు హాస్టళ్లలో నాన్‌బోర్డర్స్ (ఓయూ విద్యార్థులు కానివారు) రాజ్యమేలుతున్నారు. వారు కనికరిస్తేనే అసలైన విద్యా ర్థులకు ఓయూ హాస్టళ్లలో కాసింత చోటు దొరికే పరిస్థితి ఉన్నది. తరగతి గదులు, లైబ్రరీల నిర్వహణ కూడా సరిగా లేదని విద్యార్థులు వాపోతున్నారు. గ్లోబల్ నెట్‌వర్క్ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. 

సమస్యల వలయంలో విద్యార్థులు

ఓయూలో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థుల కోసం 18 హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 12 వేల మంది వసతి పొందుతున్నారు. మెజార్టీ హాస్టళ్లు నిజాం కాలంనాటివే కావడంతో ఏ క్షణమైనా కూలి పోయే పరిస్థితికి చేరుకొన్నాయి. ఓయూ హాస్టళ్ల కంటే సంక్షేమ హాస్టళ్లు ఎంతో నయం అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో మినరల్ వాటర్ వసతి ఉన్నప్పటికీ ఈ 1, డీ సహా పలు హాస్టళ్లలో కనీసం నీటి వసతి, మెస్ వసతి కూడా లేదని వాపోతున్నారు. ఓయూ గర్ల్స్ హాస్టల్‌లో ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉన్నది. చాలాసార్లు ధర్నాలు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. లైట్లు సరిగా వెలగకపోవటం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో పాము లు, తేల్లు, విష కీటకాలు హాస్టల్ రూమ్‌లు, మరుగుదొడ్లలోకి వస్తున్నాయని చెబుతున్నారు. వర్షాకాలంలో పలు హాస్టల్ గదులు ఉరుస్తాయని, రాత్రిళ్లు జాగారం చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. హాస్టళ్లలో మరుగుదొడ్లు, మూత్ర శాలల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉం దని చెప్తున్నారు. బాత్‌రూంలలో జారిపడి పలువురు విద్యార్థులకు గాయాలైన సందర్భాలున్నాయి.  

అధ్యాపకుల కొరత..

ఓయూలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 1,269 మంది రెగ్యులర్ అధ్యాపకులుండాలి. ప్రస్తుతం దాదాపు 320 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఏటా పదుల సంఖ్యలో రిటైర్ అవుతున్నారు. దీంతో కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకులతో యూనివర్సిటీని నడిపిస్తున్నారు. వర్సిటీలో దాదాపు 449 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 490 మంది పార్ట్ టైం అధ్యాపకులు ఉన్నారు. వారికి ఉద్యోగ భద్రత లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమించడంలో చొరవ తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వర్సిటీలో కొత్తగా డాటాసైన్స్, హానర్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. కానీ వాటిని బోధించేందుకు అధ్యాపకులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ల్యాబ్‌లలో రసాయనాలు, పరికరాలు కరువు

ఓయూలోని పలు ల్యాబ్‌లలో రసాయనాలు, పరికరాల కొరత తీవ్రంగా ఉందని పీజీ, పరిశోధక విద్యార్థులు వాపోతున్నారు. రిసెర్చ్ స్కాలర్స్ సొంత డబ్బులతో రసాయనాలు, పరికరాలను కొనుగోలు చేసి ప్రయో గాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. డాటా కలెక్షన్ కోసం హెచ్‌సీయూ, ప్రైవేటు సంస్థలను సంప్రదించాల్సి వస్తోంది. రసాయ నాల కోసం ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు రూ.లక్ష మాత్రమే వర్సిటీ కేటాయిస్తోంది. దాంతో వచ్చే రసాయనాలను డిపార్ట్‌మెంట్‌లోని పలు అనుబంధ విభాగాలకు కూడా సరిపెట్టుకోవాల్సి ఉంది. కానీ, అంతకు ఐదు రెట్లు అవసరమవుతున్నాయని అధ్యాపకులు చెప్తున్నారు. కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో ‘ఎక్స్‌ఆర్డీ’, ఫిజిక్స్‌లో ‘టెమ్’ అనే పరికరాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.  

ప్రధాన లైబ్రరీ నిర్వహణ అంతంతే..

ప్రధాన లైబ్రరీ నిర్వహణ కూడా అంతంతేనని పలువురు పరిశోధక విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. నిత్యం వందల మంది విద్యార్థులు వచ్చే ప్రధాన లైబ్రరీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి, మూత్ర శాలలు లేవని చెప్తున్నారు. ప్రధాన లైబ్రరీలో ఖాళీగా ఉన్న హాళ్లను ఉపయోగంలోకి తీసుకొస్తే మరింత మంది చదువుకోవడానికి వెసులుబాటు ఉంటుందని కోరుతున్నారు. పలు డిపార్ట్‌మెంట్ లైబ్రరీల్లో లైబ్రేరియన్లు లేని కారణంగా అటెండర్లే ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు కావలసినన్ని ఉన్నప్పటికీ నిర్వహణ సరిగా లేకపోవడంతో సకాలంలో అవి లభించటంలేదని వాపోతున్నారు. లైబ్రరీలో విద్యార్థులకు కనీసం నాణ్యమైన స్టడీ ప్యాడ్స్, స్టడీ చైర్స్, సరిపడా రీడింగ్ టేబుల్స్ లేవని చెప్తున్నారు. పోటీ పరీక్షలు ఉన్నందున లైబ్రరీ సమయాన్ని పొడగించాలని విద్యార్థులు కోరుతున్నారు.

పార్టీల హామీలు నీటి మూటలు 

ఓయూ అభివృద్ధి కోసం పార్టీలు, ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు నీళ్లమీద రాతలుగా మిగిలిపోతున్నాయి. ఓయూకు రూ.200 కోట్లు కేటాయిస్తామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రకటించారు. కానీ రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ నిధులతో కొన్ని రోడ్లు, భవనాలు పూర్తి చేసినప్పటికీ మిగతా రూ.150 కోట్లు పత్తా లేవు. ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి లేకపో వడం తో నిధులు నిలిచిపోయినట్లు విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఓయూ విద్యార్థులకు అనేక హామీలిచ్చింది. వాటిని చిత్త శుద్ధి తో నెరవేర్చితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని విద్యార్థులు చెప్తున్నారు. యూనివర్సిటీలో చదివే విద్యార్థులు, రిసెర్చ్ స్కాలర్స్‌పై ఫీజుల భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించడం కోసం కాంటిజెంట్, ఫెలోషిప్స్ ఇచ్చి ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. 

విద్యార్థులపై మెస్ బిల్లులు, ఫీజుల భారం

ఓయూలోని పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల కోర్సు ఫీజులను గత సంవత్సరం ఒక్కసారిగా పదిరెట్లకు పైగా పెంచారు. సోషల్ సైన్స్‌లో పీహెచ్‌డీ విద్యార్థుల ఫీజు రూ.2 వేల నుంచి రూ.20 వేలకు పెంచారు. దీంతో విద్యార్థులపై మోయలేని ఫీజుల భారం పడింది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులకు అదుపే లేదు. విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్న యూనివర్సిటీ అధికారులు వసతుల కల్పనను మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. మెస్ బిల్లుల భారం కూడా పెరుగుతున్నదని వాపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థుల కోసం ప్రతీ నెలా రూ.1,875 మెస్ చార్జీలను విడుదల చేస్తోంది. అవి కూడా సకాలంలో రాకపోవడం, సరిపోకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రూ.3,500 మెస్ బిల్లులు వస్తుండటంతో ప్రభుత్వం ఇచ్చే చార్జీలు సరిపోవడంలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఏటా రూ.15 వేల వరకు చేతినుంచి మెస్ బిల్లులు కట్టాల్సి వస్తున్నదని చెప్తున్నారు. నాలుగేండ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. 

గ్లోబల్ నెట్‌వర్క్ ఉన్నా అభివృద్ధి సున్నా

ఓయూలో చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారు. ఇంత గ్లోబల్ నెట్‌వర్క్ ఉన్న ఓయూకు స్థానికంగా వసతులు కల్పించడం, అభివృద్ధి చేయడంలో అధికారులు, ప్రభుత్వాలు విఫలమవతున్నాయి. ఓయూకు రూ.1000 కోట్లు కేటాయించాలి. అడ్మిషన్ పొందిన ప్రతీ విద్యార్థికి మెస్, హాస్టల్ వసతి కల్పించాలి. హాస్టళ్లు, లైబ్రరీల్లోని సమస్యలు పరిష్కరించాలి. ఓపెన్ క్యాంపస్ కావడంతో బయట నుంచి వచ్చే వ్యక్తుల వల్ల క్యాంపస్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. క్లోజ్డ్ క్యాంపస్‌గా మార్చితే ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంది.

   నెల్లి సత్య, పరిశోధక విద్యార్థి 

కొత్త భవనాలు నిర్మించాలి

ఈ 1, డీ సహా పలు పాత హాస్టళ్లకు కొత్త భవనాలు ని ర్మించాలి. హాస్టళ్లలో ని సమస్యలు పరిష్కరించాలి. యూనివర్సిటీలో రెగ్యు లర్‌గా ఫాగింగ్ నిర్వహించి దోమల ని వారణకు అధికారులు కృషి చేయాలి. మెస్ చార్జీలను పెంచాలి. లైబ్రరీలు, ల్యాబ్‌ల నిర్వహణకు సరిపడా నిధులు కేటాయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఓయూకు సరిపడా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. రెగ్యులర్ వీసీని, రెగ్యులర్  అధ్యాపకులను వెంటనే నియమించాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హెల్త్ సెంటర్‌లో వసతులు కల్పించాలి. 

 మూర్తి, పరిశోధక విద్యార్థి