calender_icon.png 26 November, 2024 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పోరుతోనే చార్జీలు పెరగలే

30-10-2024 12:50:39 AM

  1. ఈఆర్సీ డిస్కంల ప్రతిపాదన తిరస్కరించడం అభినందనీయం 
  2. రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్
  3. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి):  బీఆర్‌ఎస్ పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు తప్పిందని, ఇది తమ పార్టీ విజయమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ..  ఈఆర్సీ ఎదుట వాదనలు వినిపించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కరెంట్ భారం మోపకుండా కాపాడుకున్నామని చెప్పారు.

సర్కారు తెలివితక్కువ నిర్ణయాలతో ఆరు నెలల్లో రాష్ర్ట ఆదాయం ౪ వేల కోట్లు తగ్గిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఖజానాను దెబ్బతీసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుతో వడ్ల కొనుగోళ్ల లో కూడా గందరగోళం నెలకొన్నదని, కోత లు మొదలై నెల దాటినా సర్కారు ఇప్పటివరకు మిల్లర్లతో ఒప్పందం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్నాలకే వర్తింపజేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తెలంగాణ పత్తికి కేంద్రం మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. గుజరాత్‌లో క్వింటాకు రూ. 8వేలకు పైగా కొంటూ, మన పత్తికి మాత్రం కేవలం రూ.7,521 మద్దతు ధర ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌రెడ్డి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే రక్షణ కల్పించుకోవాల్సిన దారుణ పరిస్థితులు రాష్ర్టంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణలో పండుగలప్పుడు నలుగురు కలిస్తే ఈ ప్రభుత్వం వణికిపోతుందని, అందుకే 144 సెక్షన్ పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్ధం గా ఉన్నారని హెచ్చరించారు.

పండుగల వేళ ప్రజలు ఇండ్లల్లో దావత్‌లు చేసుకోందామం టే  విందులకు కూడా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్ బంధువుల ఇంటిపై దాడులు చేయించిన రేవంత్‌రెడ్డి సాధించేదేమిటని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రిగా బండి..

ఈ మధ్యకాలంలో బండి సంజ య్ కేంద్ర హోంశాఖ సహాయ మం త్రిని అనే సంగతి మరిచిపోయి మాట్లాడుతున్నాడని, సీఎం రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడని విమర్శించారు. రేవంత్‌ను కాపాడాలనే తాపత్రయం బండిలో ఎక్కువగా కనిపిస్తుందన్నారు.

జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య వైరం ఉంటుందని, కానీ తెలంగాణలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ లో మోదీ, రాహుల్‌గాంధీ ప్రతి రోజు యుద్ధం చేస్తుంటే రేవంత్‌కు రక్షణగా బండి సంజయ్ నిలుస్తున్నా డన్నారు. ప్రజలను ఎంత మభ్యపెట్టినా ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారనే విషయం రాష్ట్రమంతా గుర్తించిందని అన్నారు.