10 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశం
చార్మినార్, సెప్టెంబరు 6 (విజయక్రాంతి): జలమండలిలో ఓ ఉద్యోగి ఏకంగా సర్వీస్ బుక్‌లో పుట్టిన తేదీని మార్చి అవకతవకలకు పాల్పడిన వైనంపై ‘విజయక్రాంతి’లో ప్రచురితమైన ‘జలమండలిలో మహా మాయగాళ్లు ’ కథనానికి ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. మొత్తం నలుగురు ఉద్యోగులకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి శుక్రవారం చార్జ్ మెమో జారీ చేశారు. బాలాపూర్ సబ్‌డివిజన్ రియాసత్ నగర్‌లో వాటర్ బోర్డుకు చెందిన ఓ ఉద్యోగి తన సర్వీస్‌ను మరికొంత కాలం చేయడానికి వీలుగా ఏకంగా సర్వీస్ బుక్‌లోనే పుట్టిన తేదీన మార్చిన వ్యవహారం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. దీనిపై వాటర్ బోర్డు ఎండీ ప్రత్యేక వివరణను విజయక్రాంతికి తెలిపారు.
సర్వీస్ బుక్‌లో పుట్టిన తేదీని మార్చిన అంశంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్టు, ఈ విచారణలో నిబంధనలను ఉల్లంఘించి పుట్టిన తేదీని మార్చినట్టుగా ప్రాథమిక నిర్దారణకు వచ్చామన్నారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి జీఎం పి.నాగేంద్ర కుమార్, ఓ అండ్ ఎం డివిజన్ సీనియర్ ఆఫీసర్ గులాం అజర్ సిద్ద్దీక్, సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ వి.పరుశురామ్, జహనుమా విభాగం వార్డు సిబ్బంది మేకల బాబుకు చార్జ్ మెమోలు జారీ చేసినట్టు తెలిపారు. రాతపూర్వకంగా సమాధానం చెప్పాలని మెమోలో ఆదేశించారు. వీరి సమాధానం తర్వాత నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.