calender_icon.png 23 September, 2024 | 2:47 AM

చారడేసి కళ్లు ముద్దబంతి ముఖం

23-09-2024 12:00:00 AM

అందం, అభినయం, నాట్యం.. అన్నీ రాశిపోస్తే.. ఆమె వైజయంతిమాల. కలువపువ్వులాంటి కళ్లు.. చంద్రబింబం లాంటి ముఖం.. అప్పట్లో హీరోతో ప్రమేయం లేకుండా కేవలం ఆమె కోసమే టికెట్లు పోయేవి. ఓ విధంగా ఆమెది కూడా హీరో ఈమేజే. ఎంతటి నటులనైనా డామినేట్ చేయగల అద్భుతమైన సౌందర్యం వైజయంతిమాల సొంతం.

భారతీయ సినీ పరిశ్రమలో తొలి మహిళా సూపర్‌స్టార్‌గా కీర్తి గడించిన నటి ఆమె! ఆమె తల్లి వసుంధురాదేవి శాస్త్రీయ నృత్య కళాకారిణి. కొన్ని సినిమాల్లో కూడా వసుంధరాదేవి నటించారు. తల్లి వసుంధరాదేవి వారసత్వంగా వైజయంతిమాల కూడా చిన్నతనంలోనే శాస్త్రీయనృత్యం అభ్యసించి, ప్రావీణ్యం సాధించారు. కర్నాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆమెలోని కళాతృష్ణను గమనించిన తల్లి ఆమెను నటిగా ప్రోత్సహించారు. అలా 13 ఏళ్లకే నటిగా మారింది వైజయంతి. అయితే తల్లి అండ మాత్రం ఆమెకు దక్కలేదు. తల్లి ఆకస్మికంగా కన్నుమూసింది. అమ్మమ్యే అమ్మగా మారి తన ఆలనా పాలనా, బాధ్యతలు చూసుకుంది. 

తమిళంలో ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ‘వళకై’(1949) వైజయంతిమాల తొలి చిత్రం. అదే సినిమా ‘జీవితం’ (1950) పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 1954లో విడుదలైన ‘సంగం’ సినిమాలో ఎన్టీయార్‌తో కలిసి నటించారు.  దిలీప్‌కుమార్ హీరోగా రూపొందిన ‘దేవదాస్’ (1955) చిత్రంలో చంద్రముఖి పాత్రకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాత్రకు తొలి ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారామె. ఆ వరుసలోనే కెరీర్ మొత్తం మీద ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 

అప్పట్లో వారి కాంబినేషన్ అదిరిపోయేది..

హిందీ పరిశ్రమను ఉర్రూతలూగించిన కాంబినేషన్ దిలీప్‌కుమార్, వైజయంతిమాల. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మధుమతి, గంగజమున, నయాదౌర్ చిత్రాలు ఇండియన క్లాసిక్స్‌గా నిలిచాయి. అలాగే వైజయంతిమాల, రాజ్‌కపూర్ నటించిన ‘సంగం’ చిత్రం ప్రాంతాలకు అతీతమైన విజయాన్ని సాధించింది. కిశోర్‌కుమార్‌కు జోడీగా ‘న్యూఢిల్లీ’, దేవానంద్ ‘జ్యూయల్ థీఫ్’, ‘హిస్టారికల్ మూవీ ‘ఆమ్రపాలీ’, ‘గంగా జమున’, ‘నాగిన్’, ‘దేవదాస్’ తదితర చిత్రాల్లో నటించారు.

ఆ తర్వాత ‘సంఘం’, ‘వేగుచుక్క’, ‘విజయకోట వీరుడు’, ‘బాగ్దాద్ గజదొంగ’, ‘విరిసిన వెన్నెల’, ‘వీర సామ్రాజ్యం’, ‘చిత్తూరు రాణీపద్మిని’ తదితర చిత్రాల్లో నటించారు. చిత్రసీమకి దూరమైనా నృత్యకళాకారిణిగా కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు, 2008వ సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డును కూడా అందుకున్నారామె. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలు అందుకున్నారు. రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. సినీ, సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 

అవార్డును తిరస్కరించింది..

1955లో దేవదాసు సినిమాలో చంద్రముఖి పాత్రకు నర్గీస్, బీనా రాయ్, సూర్య అందరూ నో చెప్పారు. కానీ వైజయంతిమాల ఏ మాత్రం ఆలోచించకుండా నటించింది. ఈ మూవీలో వైజయంతి నటనకుగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డు ప్రకటించారు. అయితే తాను హీరోయిన్‌తో సమానమైన పాత్ర చేశానని, అలాంటప్పుడు అది సహాయ పాత్ర ఎందుకవుతుందని అవార్డును తిరస్కరించింది.  

బీ టౌన్ కోడై కూసింది..

ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్.. మధుబాలకు బ్రేకప్ చెప్పిన తర్వాత వైజయంతిమాలను ప్రేమించాడని ప్రచారం జరిగింది. తన సినిమాలో ఏ చీర కట్టుకోవాలనేది కూడా దిలీపే నిర్ణయించేవారని టాక్ నడిచింది. తర్వాత రాజ్ కపూర్‌తో ఆమెను లింక్ చేశారు. నజరాణా సినిమాలో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అప్పట్లో బీటౌన్ కోడై కూసింది. వీళ్లు సహజీవనం చేశారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన రాజ్ కపూర్ భార్య.. బెదిరింపులకు దిగడంతో ఇక మీదట వైజయంతిమాలను కలవడం, ఆమెతో పని చేయడం మానేస్తానని వాగ్దనం చేశాడట. 

ఒక ముచ్చట

1964లో రాజ్‌కపూర్ నిర్మించిన ‘సంగం’ ప్రేమకథా చిత్రంలో వైజయంతిమాల నటించింది. రాజ్‌కపూర్ నిర్మించిన తొలి రంగుల టెక్నికల్ చిత్రం ‘సంగం’. రాజ్‌కపూర్ నిర్మించిన సినిమాలలోకెల్లా అద్భుతమైన కలెక్షన్లు సంపాదించిన సినిమా ఇది. వైజయంతిమాలను హీరోయిన్‌గా ఎంచుకుని తన డేట్స్ కోసం మద్రాసులో ఉన్న ఆమెకు రాజ్‌కపూర్ “బోల్ రాధా బోల్ సంగం హోగా యా నహీ” అని టెలిగ్రాం పంపించారు. దానికి వైజయంతిమాల రిప్లు ఇస్తూ.. “హోగా.. హోగా.. హోగా..” అంటూ టెలిగ్రాం ద్వారా జవాబిచ్చింది. అదే సినిమాలో పాటై కూర్చుంది. రాజ్‌కపూర్ ఎడిటర్‌గా వ్యవహరించిన తొలి చిత్రం సంగం. సంగం సినిమాకు రెండు ఇంటర్‌వెల్స్ ఉండడం చలనచిత్ర చరిత్రలో తొలిసారి.  ఈ సినిమా విడుదలయ్యాక వైజయంతిమాల డాక్టర్ చమన్ లాల్ బాలిని వివాహమాడింది. బాలి రాజ్‌కపూర్ వ్యక్తిగత వైద్యుడు.