17-04-2025 01:43:26 AM
హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ (సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ) సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించిన మధ్యంతర నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగిందని కమిటీ తన రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం.
‘గతంలో పోరంబోకు భూములను ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి కట్టబెట్టింది. అడవులకు కావాల్సిన అన్ని లక్షణా లు ఈ భూములకు ఉన్నట్టు కనిపిస్తోంది.’ అని తన రిపోర్టులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్ ఐ) ఇచ్చే సాంద్రత నివేదిక తర్వాతే తమ రిపో ర్టు పూర్తవుతుందని కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ వెల్లడించారు.
మరో నాలుగు వారాలు కావాలి
పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు మరో నాలుగువారాల గడువు కావాలని సీఈసీ సుప్రీం కోర్టును అభ్యర్థించింది. టీజీఐఐసీ మీద తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ‘చట్టాలు ఉపయోగించి పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. పర్యావరణ విధ్వంసానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
టీజీఐఐసీ అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి తప్పుడు ప్రకటనలు చేసి విచక్షణా రహితంగా చెట్ల నరికివేతకు పాల్పడ్డారు. ఈ భూముల్లో ఉన్న వన్యప్రాణులు, ఇతరాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఈసీ భూములను ఎకోలాజికల్లీ సెన్సిటివ్ జోన్‌గా పరిగణించాలి. జీహెచ్‌ఎంసీ 12 నెలల్లోపు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని అన్ని మురుగునీటి కాల్వలను మూసేయాలి.
యూనివర్సి టీలోనే సరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. చివరగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర కమిటీని అపాయింట్ చేయాలి.’ అని కమిటీ తన మధ్యంతర నివేదికలో పేర్కొంది.
ఫారెస్ట్ సర్వే అధికారులు కనుగొన్న విషయాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంబంధిత పత్రాలను ఇంకా స్వీకరించనందున తుది నివేదికను సమర్పించేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరింది. ఈ మధ్యంతర నివేదికను సీఈసీ చైర్మన్, సభ్యులు ఆమోదించి.. సుప్రీం కోర్టు పరిశీలన కోసం పంపారు.