రైల్వే జీఎం జైన్‌తో మంత్రి పొంగులేటి భేటీ
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న మార్గాల అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు విజ్ఞప్తిచేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎం తో మంత్రి సమావేశమయ్యారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండ లం నాయక్‌గూడెం, సూర్యాపేట జిల్లా మోతే మీదుగా గద్వాల వరకు ప్రతిపాదించి న నూతన రైల్వే మార్గం అలైన్‌మెంట్ మార్చాలని పొంగులేటి కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల మీదుగా ఈ రైల్వే మా ర్గం వెళ్తుందని, దీనివల్ల సాగు భూమలను రైతులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా అలైన్‌మెంట్‌లో మార్పుచేసి మరో మార్గంలో రైల్వేలైన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు.
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని వరంగల్ నగర బైపాస్ రైల్వే లైన్‌ను నిర్మించాలని కోరారు. వరంగల్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2050కి అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ నష్కల్ నుంచి హసన్‌పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించనున్న మార్గాన్ని వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు అనుసంధానం చేయాలని కోరారు.
ప్రస్తుతం సిద్ధం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అలైన్‌మెంట్ మార్చాలని జీఎంకు విజ్ఞప్తి చేశారు. పలు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి జీఎంతో మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి హరిచందన పాల్గొన్నారు.