28-02-2025 06:59:40 PM
జనరల్ అసిస్టెంట్ గా ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం ..
బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య...
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో పనిచేస్తున్న బదిలీ వర్కర్, జనరల్ మజ్దూర్ కార్మికుల డిజిగ్నేషన్ మార్పు చేస్తూ, జనరల్ అసిస్టెంట్ గా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బిఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి చరిత్రలో బదిలీ వర్కర్, జనరల్ మజ్దూర్ డిజిగ్నేషన్ తో ఏళ్ల తరబడి సామాజిక అసమానతలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులను యాజమాన్య ప్రతినిధులు సంవత్సరాల తరబడి సమాజంలో ఇబ్బందులు పెడుతున్నారని, కార్మిక బస్తీలలో సైతం తోటి కార్మికులతో సైతం వారు అవస్థలు పడుతున్నారని, కార్మిక పిల్లలు చదువుకునే కార్పొరేట్ పాఠశాల కళాశాల సైతం సోషల్ స్టేటస్ పేరు తోటి కార్మికుని పిల్లలను అవమాన పరుస్తూ జరుగుతున్న అసమానతను సింగరేణి పర్యటనలో బిఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి గ్రహించారన్నారు.
ఆయన ఆదేశాల మేరకు గత సంవత్సరం ఫిబ్రవరి 6, 2024 రాజస్థాన్ జైసల్మార్ లో జరిగిన స్టాండర్డ్ డైజేషన్ కమిటీ 2వ సమావేశంలో కమిటీ సభ్యులు సుధీర్ గురుడే, మజ్రుల్ హక్ అన్సారి, సింగరేణి నుండి తాను సుదీర్ఘంగా కోలిండియా, సింగరేణి యాజమాన్యంతో చర్చించి, బదిలీ వర్కర్, జనరల్ మజ్దూర్ డిజిగ్నేషన్ ను వెంటనే రద్దు చేస్తూ, పరిశ్రమలలో గౌరవప్రదమైన, తోటి కార్మికులతో ఉండే విధంగా జనరల్ అసిస్టెంట్ గా మారుస్తూ, ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఒప్పందం జరిగి అమలుపై జాప్యం చేస్తున్న కోలిండియా యాజమాన్య ప్రతినిధులతో కొత్తకాపు లక్ష్మారెడ్డి మాట్లాడి, ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా కోరడంతో వెంటనే స్పందించిన కోలిండియా యాజమాన్య ప్రతినిధులు ఫిబ్రవరి 6,2025న డిజిగ్నేషన్ మార్పు ఒప్పందాన్ని అమలు చేయుటకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారన్నారు.
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న బదిలీ వర్కర్, జనరల్ మజ్దూర్ కార్మికుల డిజిగ్నేషన్ మార్పుపై సింగరేణి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు స్పందించని కార్మిక సంఘాల వైఖరిని కార్మికులు గమనించాలని కోరారు. సింగరేణి వ్యాప్తంగా సంస్థ పరంగా సోషల్ స్టేటస్ పెంచుతూ, గౌరవప్రదమైన డిజిగ్నేషన్ మార్పు చారిత్రాత్మకమైన ఒప్పందమన్నారు. అన్ని గనులలో బదిలీ వర్కర్, జనరల్ మజ్దూర్ కార్మికులు సంబరాలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు డొనికెల రమేష్, ఏరియా కార్యదర్శి గుర్రం ప్రదీప్ కుమార్ లు పాల్గొన్నారు.