18-04-2025 12:00:00 AM
10 నుంచి 20 శాతం వరకు మార్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): గ్రూప్స్ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించి సిలబస్‌ను మార్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. అయితే పూర్తిస్థాయిలో కాకుండా కొన్ని అంశాలను సిలబస్ నుంచి తొలగించనున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. 10 నుంచి 20 శాతం వరకు సిలబస్‌లో మార్పులు చేయనున్నట్టు సమాచారం.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఇతర అంశాలకు సం బంధించిన అంశాలను కొంతమేర సిలబస్ నుంచి తొలగించనున్నా రు. సిలబస్ సహా నూతన సంస్కరణలపై టీజీపీఎస్సీ బుధవారం అన్ని యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యామండలి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వర్సిటీల్లో అమలవుతున్న సిలబస్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఇతర అంశాలపై చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
గ్రూప్స్ నియామక ప్రక్రియలో ఈసారి కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్టు గతంలోనే టీజీపీఎస్సీ చెప్పడంతో.. గ్రూప్ 2లోనూ మళ్లీ ఇంట ర్వ్యూ విధానం తీసుకొస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలోనే సిలబస్ సహా పరీక్షల విధానంపైన టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. చివరగా పోటీ పరీక్షల సిలబస్‌ను 2015లో ఖరారు చేశారు. అప్పట్లో ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ చైర్మన్‌గా 25 మంది విషయ నిపుణులతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ పలు అంశాలపై కూలంకషంగా చర్చించి పలు సిఫార్సులు చేసింది. అప్పటి నుంచి ఇదే విధానం అమలవుతుండగా, తాజా గా సిలబస్‌ను మార్చే దిశగా టీజీపీఎస్సీ కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన గ్రూప్స్ పరీక్షల్లో ఏపీకు సంబంధించి 20 నుంచి 30 ప్రశ్నలను అడగడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అయితే సిలబస్‌లో కొన్ని అంశాలను తొలిగిస్తే ఇప్పటికే ఆయా అంశాలను చదివిన వారికి నష్టం కలిగే అవకాశమూ ఉంది. ఇన్ని రోజులు చదివింది, కొనుగోలు చేసిన పుస్తకాలు, వృథా అయినట్టేనని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.