calender_icon.png 19 January, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటు కమిషన్ చైర్మన్‌ను మార్చండి

17-07-2024 04:32:35 AM

  • రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం 
  • కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడం తప్పే 
  • కేసీఆర్ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం 
  • సోమవారంలోగా కొత్త చైర్మన్‌ను నియమిస్తాం 
  • రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల వెల్లడి 
  • విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నరసింహారెడ్డి

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్ ఒప్పం దాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా విచారణ జరుపుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళ వారం విచారణ సందర్భంగా ఈ ఆదేశాల జారీచేసింది. దీంతో వచ్చే సోమ వారంలోపు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకొంటున్నట్టు జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటించారు. 

విచారణ మధ్యలో ప్రెస్‌మీట్ పెట్టడం తప్పు

కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దుచేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లగా, ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదించారు. కమిషన్ విచారణ ఏకపక్షంగా సాగుతున్నదని, విచారణ పూర్తికాకుండానే నివేదిక ఎలా ఉండబోతున్నదో వెల్లడించిందని ఆరోపించారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసిం హారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి పిటిషనర్‌పై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్ లూద్రా వాదిస్తూ కమిషన్ ఏర్పాటు చట్టప్రకారమే జరిగిందని, విచారణలో భాగంగానే కమిషన్ మీడియా సమావేశం నిర్వహించిందని తెలిపారు. విచారణలో రహస్యమేమీ లేదని, బహిరంగ విచారణే జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కమిషన్ చైర్మన్‌ను మార్చాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అందు కు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం తెలిపింది.

ఇంతలోపే విచారణ నుంచి తప్పకుంటున్నట్లు న్యాయవాది ద్వారా జస్టిస్ నరసింహా రెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ముగించింది.

కక్ష సాధింపు ధోరణితో విచారణ 

ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే జ్యుడీషియల్ విచారణకు ఆదేశి ంచిందని కేసీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. కమిషన్ ఏర్పాటులో చట్ట పరిధిని అతిక్రమించారని, ట్రైబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ కమిషన్ వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత అత్యవసర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని ధర్మాసనానికి చెప్పారు. మార్కెట్ ధర కంటే తక్కువగా యూనిట్ విద్యుత్తు రూ.3.90కు మాత్రమే కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. విచారణకు ముందే పిటిషనర్‌ను దోషిగా తేలు స్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో రాష్ట్రం నుంచే విద్యుత్ కొనుగోలు చేసిందని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కాదని గుర్తుచేశారు. ప్రభుత్వం సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్‌కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినట్లు గుర్తుచేశారు. ఎన్నికలకు ముందే ప్రస్తుత సీఎం ఆర్‌టీఐ ద్వారా అనేక సమాచారాలు సేకరించి పెట్టుకున్నారని, వాటి ఆధారంగా ముందస్తు ఆలోచన తోనే కక్షసాధింపుతో కమిషన్ వేశారని ఆరోపించారు.

విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టి ఏకపక్షంగా మాట్లాడారని రోహత్గీ తెలిపారు. ప్రెస్‌మీట్‌పై సీజేఐ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్ తన సొంత అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని పేర్కొంది. చైర్మన్‌ను మార్చి మరొకరిని నియమించాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనబడా లని వ్యాఖ్యానించారు.  

అందుకే ప్రెస్‌మీట్ పెట్టా 

విచారణ కమిషన్లు వేసేదే ప్రజలకు అన్ని విషయాలు తెలియచెప్పేందుకని, అలాంటి తనపై అబద్ధాలు ప్రచారం చేశారని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్లు ధర్మాసనానికి రాసిన లేఖలో తెలిపారు. కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత చెలరేగిన కొన్ని ఊహాగానాలను కట్టడి చేసేందుకే ప్రెస్‌మీట్ పెట్టానని, దీంట్లో తన సొంత అభిప్రాయం లేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో తాను సమావేశమైనట్లు ప్రచారం జరిగిందని, ఆయనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని స్పష్టంచేశారు.