అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అంసెబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మరో పక్క హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పల్నాడులో హింసాత్మక ఘటనపై తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పడు ఫిర్యాదు చేస్తున్న, శాంతిభద్రతలను కాపాడుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఈసీ తక్షణమే సమీక్షించి చక్కదిద్దాలని చంద్రబాబు కోరారు. అటు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి ఏజెంట్లపై వైసీపీ నాయకులు రాళ్లదాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.