తాజా రాజకీయ పరిస్థితులు, ఇరు రాష్ట్రాల సహకారంపై చర్చ
చంద్రబాబుతో భేటీపై మహారాష్ట్ర సీఎం షిండే ట్వీట్
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : ముంబాయి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం మాహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యా రు. షిండే అధికారిక నివాసానికి వెళ్లిన చంద్రబాబుకు ఆయన సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందచేసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహాకారం, మౌలిక వసతుల అభివృద్ది, పలు ఆర్దిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగాయి. చర్చల అనంతరం చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫోటోలను ఏసీ ఏక్‌నాథ్ షిండే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకరించుకోవడం ద్వారా ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర విమాన యానశాఖ మంత్రి రామ్మోహన్ నాయడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడి మంత్రి దాదా భుసే తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, శివసేన పార్టీలు కేంద్రంలోని ఏన్టీయే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.