09-04-2025 08:51:27 PM
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): దేశంలో భూపోరాలకు శ్రీకారం చుట్టి నిరుపేదల జీవనోపాది కల్పించిన చండ్ర రాజేశ్వరరావు చిరస్మరణీయుడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు చండ్ర రాజేశ్వర్రావు 31వ వర్ధంతిని బుధవారం శేషగిరి భవన్లో ఘనంగా నిర్వహించారు. తొలుత సిఆర్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు. జమీందారి కుటుంబంలో జన్మించి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడై తన యావదాస్తిని పేదలకు పంపిణీ చేసిన మహానీయుడని కొనియాడారు. పేదలకు భూమి దక్కితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించిన సిఆర్ దేశవ్యాప్త భూపోరాటాలకు నాంది పలికాడన్నారు. మహిళలపై దాడులు, అరాచకాలను అరికట్టేందుకే, ఉద్యమాలను అనిచివేతను పూనుకుంటున్న ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్యమాల్లో పాల్గొనే ప్రజలకు రక్షణ కల్పించేందుకే ఆరు దశాబ్దాల క్రితమే జనసేవాదళ్ను ఏర్పాటు చేసిన ముందు చూపు ఉన్న మహానేత అని కొనియాడారు.
ఆయన చూపిన మార్గంలో పయనించి ప్రజా ఉద్యమాలకు నిర్మించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, వంగ వెంకట్, భూక్యా దస్రు, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమార్, ఎస్ కె ఫహీమ్, నేరెళ్ల రమేష్, ధర్మరాజు, జహీర్, వుల్లోజు వెంకట్, లక్ష్మి, గుత్తుల శ్రీనివాస్, పల్నాటి వీణ రాణి, షమీమ్, మర్రి కృష్ణ, రసూల్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.